వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నల్లగొండలో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం
నల్లగొండ, నవంబర్ 23 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శనివారం జరిగిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.
మాదిగ జాతి ఎవరికీ వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లలో తమకు న్యాయంగా రావాల్సిన వాటాను మాత్రమే అడుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ సూచన ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను నియమించిందన్నారు.
ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగానే ఏబీసీడీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 14లోగా ఉపకులాలు తమ అభిప్రాయాలను ఏకసభ్య కమిషన్‌కు నివేదిం చవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ఉస్మానియా ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్, పిడమర్తి రవి పాల్గొన్నారు.