calender_icon.png 26 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌసింగ్ సొసైటీలకు సుప్రీం షాక్

26-11-2024 01:16:25 AM

  1. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూకేటాయింపులు రద్దు చేస్తూ తీర్పు
  2. సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో తిరిగివ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు సొసైటీలకు ప్రభుత్వాలు చేసిన భూకేటాయింపుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సంఘాలకు చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది.

వీరిని ప్రత్యేక క్యాటగిరీగా పరిగణించి రాయితీతో భూమిని కేటాయించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. వీరిని ప్రత్యేక క్యాటగిరీగా వర్గీకరించేందుకు 2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన మెమోరాండంను కొట్టేసింది.

అంతేకాకుండా ఆయా సొసైటీలు చెల్లించిన డబ్బును ఆర్బీఐ నిర్ణయించిన వడ్డీతో సహా తిరిగి వారికే ఇవ్వాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వాలు భూకేటాయింపులు చేయడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త రావు బీ చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌పై  విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ చెందేవాటిని ఇలా పంచటం సరికాదని, అవి అందరికీ సామాజికంగా ఉపయోగపడేలా ఉండాలని తెలిపింది. కొందరికే మేలు జరిగేలా ఇలాంటి విధానాలను ఏకపక్షమని, అసమానతను ప్రోత్సహిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇది కచ్చితంగా ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ప్రత్యేకంగా పరిగణించి భూమి ప్రాథమిక విలువలో రాయితీ ప్రకటించి మరీ ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

సందిగ్ధంలో జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ

హైదరాబాద్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు పేట్ బషీరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 8న ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైస్సార్ ఈ సొసైటీకి ఇళ్ల స్థలాల కోసం 70 ఎకరాల భూమి (నిజాంపేటలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్‌లో 38 ఎకరాలు) కేటాయిస్తూ 2008 మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే నిజాంపేటలోని 32 ఎకరాల స్థలం సొసైటీ అధీనంలో ఉండగా పేట్ బషీరాబాద్‌లోని ఇళ్ల స్థలాలను సీఎం రేవంత్‌రెడ్డి రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన వారికి అందజేశారు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హౌసింగ్ సొసైటీలు పొందిన భూముల విషయంలో సందిగ్ధం నెలకొంది.   

మానవీయ కోణంలో ఆలోచించాల్సింది: టీయూడబ్ల్యూజే

ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత దురదృష్టకరమని, జర్నలిస్టుల విషయంలో ధర్మాసనం మానవీయ కోణంలో ఆలోచించాల్సిందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి గత, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల నిర్ణయం చెల్లదంటూ కోర్టు చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చొరవతో సుప్రీంకోర్టు అప్పట్లో జర్నలిస్టులకు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఇచ్చిన తీర్పును ప్రస్తుత సుప్రీంకోర్టు కొట్టివేయడం నిజంగా దురదృష్టకమని తెలిపా రు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతోనే ఈ విధం గా తీర్పు వచ్చిందని, జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం పోరాడాలని ఆయన సూచించారు.