25-04-2025 03:54:36 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీర్ సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అయితే, స్వాతంత్ర్య సమరయోధులపై ఇకపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని... ఆయన ఎటువంటి బాధ్యతారహిత ప్రకటన చేయకూడదని జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం రాహుల్ గాంధీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వీని కోరింది. మహారాష్ట్ర ప్రజలు వీర్ సావర్కర్‌ను ఎంతో గౌరవిస్తారని, రాహుల్ గాంధీ ఒక జాతీయ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి అలాంటి ప్రకటన చేయకూడదని కోర్టు న్యాయవాదికి తెలిపింది.
దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని ధర్మసనం పేర్కొంది. ఇకపై స్వాతంత్ర్య సమరయోధులను అపహాస్యం చేస్తే కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని వెల్లడించింది. "మీ క్లయింట్ కు మహాత్మా గాంధీ వైస్రాయ్ ని ఉద్దేశించి "మీ నమ్మకమైన సేవకుడు" అని కూడా ఉపయోగించారని తెలుసా..?, ఆయన నాన్నమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పెద్దమనిషిని ప్రశంసిస్తూ లేఖ పంపారని మీ క్లయింట్ కు తెలియదా..?, చరిత్ర తెలిసిన రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధులను ఇలా చూడరని, మీరు ఎందుకు ఇలా వ్యాఖ్యానిస్తున్నారని న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయనపై పరువు నష్టం దావా కేసులను నిలిపివేస్తూ, ఇకపై అలాంటి ప్రకటన చేయకుండా ఆయనను నిరోధిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నాయకుడి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు రాహుల్ గాంధీ తరపు న్యాయవాదికి స్పష్టంగా చెప్పింది. వినాయక్ దామోదర్ సావర్కర్ పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల కేసులో తనపై జారీ అయిన సమన్లను రద్దు చేయడానికి నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 17, 2022న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ర్యాలీలో తన భారత్ జోడో యాత్ర సందర్భంగా, సావర్కర్ పెన్షన్ పొందుతున్న బ్రిటిష్ సేవకుడని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యతో బాధపడ్డ న్యాయవాది నృపేంద్ర పాండే 2024 డిసెంబర్‌లో రాహుల్ గాంధీపై లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు.