calender_icon.png 3 April, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హత జాప్యంపై తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

02-04-2025 12:33:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. గతవారం పిటిషనర్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున వాదనలు ముగిశాయి. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.  కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఆదేశించినప్పటికి తగు చర్యలు తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ అనవసర జాప్యం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

స్పీకర్ ను ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా లేదా అనేది పరిశీలిస్తామని, కేసు మెరిట్స్ లోని వెళ్లట్లేదని అత్యున్నత న్యాయస్థానం గతవారం విచారణ సందర్భంగా చెప్పింది. పార్టీ మారి, మరో పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసిన దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖాలు చేశారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ను కూడా కౌశిక్ రెడ్డి పిటిషన్ కు సుప్రింకోర్డు జత చేసింది. ఫిరాయింపుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యం గురించి జస్టిస్‌లుభూషణ్ రామకృష్ణ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ శాసనసభ స్పీకర్, కార్యదర్శిని సూటిగా ప్రశ్నించింది.

అనర్హత ప్రక్రియల కోసం షెడ్యూల్‌ను సెట్ చేయాలని మాత్రమే సూచించిన సింగిల్ జడ్జి ఉత్తర్వుపై అప్పీల్ చేయాలనే కార్యదర్శి నిర్ణయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి షెడ్యూల్‌ను నిర్ణయించమని మాత్రమే అడిగినప్పుడు, ఆ ఆదేశాలపై మీరు ఎందుకు అప్పీల్ దాఖలు చేశారు? అలాంటప్పుడు బీఆర్ఎస్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (Special Leave Petition)పై మా విచారణకు మీరు ఎలా అభ్యంతరం చెప్పగలరు..? అని ధర్మాసనం అడిగింది. సంబంధిత చట్టాలలో ఎటువంటి మార్పులు లేవని పేర్కొంటూ, ఉప ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.