న్యూడిల్లీ: జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన కేసుల బదిలీ, బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ రిపోర్టును గురువారం సాయంత్రం దాఖలు చేసినట్లు సీబీఐ లాయర్ కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం సీబీఐ సమర్పించిన స్టేటస్ కాపీని పరిశీలిస్తున్నామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం పేర్కొంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరపు న్యాయవాదులు డాక్యుమెంట్ల పరిశీలనకు అదనపు సమయం కోరారు. ఈ అంశంపై తదుపరి విచారణ జనవరి 10న జరగనుంది.
జగన్ కేసుల విచారణ ఆలస్యమవుతోందని గతంలో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ లో రఘురామ పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయకపోతే విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ వేశారు. రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలు పరిశీలించాక తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.