19-04-2025 12:00:00 AM
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇంతెత్తున లేచారు. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడమే ఇందుకు కారణం. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆర్.ఎన్ రవి కేసులో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు కోపం తెప్పించింది. అత్యున్నత న్యాయస్థానం తన పరిధి దాటి వ్యవహరించిందని, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘దేశంలో చట్టాలు చేసేదీ, అమలు చేసేదీ వారే అన్నట్టుగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారు. చట్టాలకు అతీతమన్నట్టుగా, సూపర్ పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారు. వారికి ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే, దేశ చట్టాలు వారికి వర్తించవు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142.. దేశంలోని ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా 24 గంటలూ న్యాయవ్యవస్థకు అందుబాటులో ఉన్న అణు క్షిపణిలా మారింది. ఆర్టికల్ 145(3) సుప్రీంకోర్టుకు రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కును ప్రసాదిస్తుంది. దీనికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ దేశంలో నాతోసహా ఏ వ్యక్తిపై అయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కానీ, న్యాయమూర్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేని పరిస్థితి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కరెన్సీ నోట్ల కట్టలు దొరికితే ఇంతవరకు ఆయనపై కేసు నమోదు కాలేదు’ అన్నారు. గురువారం 6వ బ్యాచ్ రాజ్యసభ ఇంటర్నీలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిందని మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారీ, సీనియర్ న్యాయవాది షాదన్ ఫర్సద్ వంటి వారు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తోపాటు ఇంకొందరు సుప్రీంకోర్టును తప్పుబట్టారు. దేశ అత్యన్నత న్యాయస్థానం తన పరిధి దాటిందని దుయ్యబట్టారు. తాజా వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు ఈ జాబితాలోకి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ కూడా చేరారు. రాష్ట్రపతి లేదా ప్రభుత్వం తరఫు వాదన వినకుండా ఏకపక్షంగా సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించిందనే వాదన ఇక్కడ బలంగా వినిపిస్తున్నది. వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు.
ఎగువ సభ అధ్యక్ష పదవిలో ఉన్న వారు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడమనేది అనాదిగా వస్తున్నది. అందువల్ల పాలసీలు, రాజకీయాలు, న్యాయపరమైన తీర్పుల విషయంలో ఉపరాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఒక సాధారణ పౌరుడిగా ధన్‌ఖడ్‌కు న్యాయవ్యవస్థ పనితీరు లేదా ఇతర అంశాలపై తీవ్రంగా విమర్శించే హక్కు ఉంది. అయితే, ఆయన ఉపరాష్ట్రపతిగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ప్రశ్నించడం సమంజసమేనా అనే సందేహం ఇక్కడ కలుగుతుంది.