calender_icon.png 5 March, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు

05-03-2025 12:44:27 AM

  1. కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వానికి కూడా.. 
  2. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ వైఖరి వద్దని హితవు
  3. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యల్లేవో..? వివరణ ఇవ్వండి 
  4. 25కు విచారణ వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 4: ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసు కోవడం లేదు ? ఇంకా ఎంత సమయం కావాలి ? ఎమ్మెల్యేల పదవీకాలం ముగి సే వరకూ జాప్యం చేస్తూనే ఉంటారా ? స్పీకర్ ఇలా కాలయాపన చేస్తుంటే ఇక ప్రజాస్వామిక విలువలకు అర్థమేముంది?  ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. విధానం వద్దు’ అంటూ సుప్రీం కోర్టు మంగళవారం తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శితో పాటు ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు వారికి నోటీసులు జారీచేసింది. బీఆర్‌ఎస్ నుంచి బీఫారం తీసుకుని, ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ బీఆర్ గవా య్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌పై ఇప్పటివరకు అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఎలాంటి నోటీసులు అందలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో  ధర్మాసనం స్పందిస్తూ.. నోటీసులు జారీ చేయకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. వెంట నే తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు ఈ నెల 22లోపు సమాధానం ఇవ్వా లని ఆదేశించింది. అలాగే విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని 2024లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి  కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వెంటనే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అన ర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ.. అసెంబ్లీ కార్యదర్శి ప్రత్యేక బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు. అప్పీల్‌పై ప్రత్యేక బెంచ్ స్పందిస్తూ.. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం కావాలో స్పీకర్ నిర్ణయించవచ్చు’ అని సూచించింది.

కానీ.. అప్పటి నుంచి స్పీకర్ స్పందించకపోవడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ప్రతివాదు లకు నోటీసులు జారీ చేసింది.