calender_icon.png 2 January, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు సీరియస్

21-08-2024 12:30:00 AM

కోల్‌కతా ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటన జరిగి పది రోజులయినప్పటికీ తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోల్‌కతాహైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది. ఓ వైపు సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే సుప్రీంకోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసు విషయంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

అదే సమయంలో ఆర్జ్జీకార్  వైద్య కళాశాల ప్రిన్సిపాల్  సందీప్ ఘోష్ తీరుపైనా మండిపడింది. అంతఘోరం జరిగితే ఆత్మహత్య అని  ఎలా చెప్పారని ప్రశ్నించింది. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఘటన విషయంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల వ్యవహరించిన తీరుపై ధర్మాసనం మండిపడింది. ‘ఉదయం నేరం జరిగిందని గుర్తించినట్లు తెలిసింది. కానీ ప్రిన్సిపాల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రవర్తనపై అనుమానాలున్నప్పుడు వెంటనే మరో కాలేజికి ఎలా నియమించారు.

ఇక ఎఫ్‌ఐఆర్ నమోదు కూడా ఆలస్యమయింది. మధ్యాహ్నం 4 గంటల లోపు శవపరీక్ష పూర్తయింది. కానీ మృదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఆస్పత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేశారు? మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులు గంటలసేపు వేచి చూసేలా చేశారు’ అంటూ న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. క్షేత్రస్థాయిలో మార్పు రావడం కోసం దేశం మరో హత్యాచారం జరిగేదాకా వేచి చూడలేదంటూ వ్యాఖ్యానించిన న్యాయస్థానం వైద్యుల భద్రతకు తామే చర్యలు సూచిస్తామని స్పష్టం చేసింది.

ఈ కేసు దర్యాప్తు స్థాయీ నివేదికను ఈ నెల 22లోగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయమై ఆస్పత్రులు తీసుకోవలసిన పలు చర్యలను సూచించింది. ‘మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, పని చేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి సమానత్వాన్ని నిరాకరించినట్లే. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పని చేస్తున్నారు.

వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్‌ను రూపొందించడం అవసరం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం ఇందుకోసం 10 మంది సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీనివాస్, హైదరాబాద్ ఏఐజి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డితో పాటుగా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖ వైద్యులు సభ్యులుగా ఉన్నారు. వైద్యుల భద్రతపై తీసుకోవలసిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఈ కమిటీకి సూచించింది.

వైద్యుల భద్రత అంశాన్ని తాము చేపట్టినందున వీలయినంత త్వరగా విధుల్లో చేరాలని ఆందోళన చేస్తున్న వైద్యలకు ధర్మాసనం సూచించింది. దేశవ్యాప్తంగా రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆందోళన విరమించి విధుల్లో చేరాలని కోరింది. అలాగే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదంటూ బెంగాల్ ప్రభుత్వం తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశమన్న న్యాయస్థానం క్రైమ్‌సీన్‌ను, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనంటూ చురకలు వేసింది .దీనిపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కు వాయిదా వేసింది.