న్యూఢిల్లీ: నేరస్థుల ఆస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. నిందితుల ఇళ్లను బల్డోజర్ తో కూల్చడం తగదని, ఇది చట్ట విరుద్ధమని తెలిపింది. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమేనని పేర్కొంది. విచారణ పూర్తి కాకుండానే నిందితులను దోషిగా పరిగణించలేం.. దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉండాలని సుప్రీం కోర్టు తెలిపింది.
కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించలేరు.. కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తిగా మారలేరు. నిందితుల ఆస్తులను కూల్చివేయాలని నిర్ణయించలేడని తెలిపింది. రాష్ట్రాలు, అధికారులు ఏకపక్ష, మితిమీరిన చర్యలు తీసుకోలేరని సుప్రీం కోర్టు వెల్లడించింది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులను రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని చెప్పింది. కూల్చివేతలపై అధికారుల ఏకపక్ష నిర్ణయం చట్ట విరుద్ధమని చెప్పింది. అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమని తెలిపింది. ఆశ్రయం పొందేందుకు పౌరులకు హక్కు ఉంటుందని చెప్పింది. అమాయకుల హక్కులు హరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తెలిపింది.