17-04-2025 01:09:20 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): బుల్డోజర్లతో పచ్చదనాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగగట్టడమే కాకుండా కంచ గచ్చిబౌలిలో పచ్చదనాన్ని తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టు పేర్కొన్న వ్యాఖ్యలు చెంపపెట్టులాంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నివేదిక కోరడాన్ని స్వాగతిస్తున్నట్టు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. తెలంగాణ మాడల్ అనే పేరుతో భూవిక్రయాలు, చెరువుల దోపిడి, సంస్థాగత నష్టం, పర్యావరణ విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదని..
ప్రజల ఆస్తుల దోపిడి మాత్రమేనని దుయ్యబట్టారు. భూములు మాత్రమే కాదని నోటిఫై అయిన చెరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తనఖా పెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీని, బీజేపీని భయపెట్టాలనే కలలకు కాంగ్రెస్ దూరంగా ఉంటే మంచిదని లేదంటే జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరువు పోతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.