calender_icon.png 6 October, 2024 | 4:21 AM

రేషన్‌కార్డుల జాప్యంపై సుప్రీం ఆగ్రహం

06-10-2024 01:29:41 AM

రాష్ట్రాలకు చివరి చాన్స్ ఇస్తూ హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఈ విషయంలో తమ ఓపిక నశించిందని పేర్కొంది.

తమ ఉత్తర్వులను పాటించేందుకు చివరి అవకాశమనిస్తున్నామని రాష్ట్రాలకు సూచించింది. లేదంటే ప్రభుత్వ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఈ విషయంలో నవంబర్ 19లోగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.

కొవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని 2020లో దీనిపై సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఈ-శమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల మందికి కార్డులు జారీచేయాలని 2021లో కోర్టు ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు పూర్తి చేయగా మరికొన్ని జాప్యం చేస్తున్నాయి.