calender_icon.png 8 April, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్లను దళారులకు అమ్ముకోవద్దు

08-04-2025 12:00:00 AM

హుస్నాబాద్, ఏప్రిల్ 7 : రైతులు దళారులను ఆశ్రయించకుండా వడ్లను నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే  విక్రయించి లాభాన్ని పొందాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ, గోవర్ధనగిరి, నం దారం, ధర్మారంలో గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నిర్వహించబోయే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. రైతులు తమ పంటను దళారులకు అమ్ముకోవద్దన్నారు.

సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సరైన సమయంలో డబ్బులు అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ధాన్యం నాణ్యతను పరిశీలించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకురావాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సీసీలు శివచరణ్ సింగ్, రాజు, పంచాయతీ కార్యదర్శి కార్తిక్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు కవిత, రమ,  గ్రామ సమాఖ్య అధ్యక్షులు అనుముల లత, కోల లత, ఆజ్మీర శ్రీలత తదితరులు పాల్గొన్నారు.