సింగరేణి సంస్థలో విశ్రాంత ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్ కోసం కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ రీజినల్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం సింగరేణి జిఎం పర్సనల్ (వెల్ఫేర్) 27-.7.-2023 నాడు ప్రకటన జారీ చేశారు. ఇది చూసి సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ద పెన్షన్‌దారులందరూ అధిక ప్రయాసపడి తమ, జీవిత భాగస్వామి ఆధార్ కార్డ్‌లు, పెన్షన్ తీసుకునే బ్యాంక్ (ఫార్మర్, సర్వేవర్ మోడ్)లో జిరాక్స్ కాపీలు, భార్యాభర్తలు కలిసి దిగిన ఫొటోలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్ కాపీలను పని దిగిపోయిన గని సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించారు. వీరంతా గత ఆరునెలల నుండి సవరించిన పెన్షన్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని గనుల నుంచి సీఎంపిఎఫ్ కార్యాలయానికి చేరిన దరఖాస్తులను పరిశీలించి కొందరికి మాత్రమే సవరించిన పెన్షన్ ఆర్డర్లు వచ్చాయి.
చాలాచోట్ల పని దిగిపోయిన గని కార్యాలయాల నుంచి కోల్‌మైన్స్ ప్రావిడెంట్ కార్యాలయానికి విశ్రాంత ఉద్యోగుల పత్రాలను పంపడంలో చాలా జాప్యం జరుగుతున్నది. సీఎంపిఎఫ్ ఆఫీసుకు చేరిన పత్రాలను పరిశీలించి వెంటనే పాత వారి రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీని విశ్రాంత ఉద్యోగుల ఇంటి చిరునామాకు చేరవేయాలని, 11వ వేజ్‌బోర్డ్‌లో పెరిగిన జీతాలను అనుసరించి పెరిగిన పింఛను లెక్కలు సరి చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేయాలని బొగ్గు పెన్షన్‌దారులు కోరుతున్నారు. కోల్‌మైన్స్ పెన్షన్ స్కీం -1998 ప్రకారం గనులవద్ద ఉన్న రికార్డ్‌లోని భార్య పేరుతో మాత్రమే నామినీగా గుర్తిస్తున్నారు. దురదృష్టవశాత్తు భార్య మరణిస్తే, పింఛనుదారుడు చట్టబద్ధంగా మరో స్త్రీని వివాహమాడితే ఆ రెండవ భార్య పేరును నామినీగా గుర్తించక పోవడం బాధాకరం.
కనుక, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న రెండవ భార్యను కూడా నామినీగా గుర్తించి పెన్షన్‌దారుని తదనంతరం ఆమెకూ పింఛను వచ్చే విధంగా కోల్‌మైన్స్ పెన్షన్ స్కీమ్‌ను సవరించాలి. ఎన్నో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేసిన తరువాత పెన్షన్ స్కీం- 1998 ప్రకారం కనీస పెన్షన్ రూ॥ 350 నుంచి 1,000 లకు పెంచుతున్నామని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. పెన్షన్ ఫండ్ బలోపేతానికి బొగ్గు యాజమాన్య సంస్థలు, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు కృషి చేసి కనీస పింఛను రూ. 10,000 లకు తగ్గకుండా మంజూరు చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.
ఆళవందార్ వేణుమాధవ్, ఉప ప్రధాన కార్యదర్శి
సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్