కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి పొన్నం
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడీటీఆర్) తరహాలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో డ్రైవర్ల శిక్షణ కోసం ఐడీటీఆర్ ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురాం రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, సురేశ్ షెట్కార్‌తో కలిసి పొన్నం కేంద్రమంత్రిని కలిశారు. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ ఈవీ పాలసీని తీసుకొచ్చిందని పొన్నం తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, ఇక్కడ బహుళ- లేన్ ఆటోమేటిక్ వెహికల్స్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌ను నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని పొన్నం కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లను ఆటోమేటిక్ చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు.