calender_icon.png 21 April, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలకు అండ

21-04-2025 01:21:24 AM

ఇంద్రవెల్లి సంస్మరణ సభలో మంత్రి సీతక్క

అమరుల కుటుంబాలకు రూ.పది లక్షల  చొప్పున సాయం

ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): జల్, జమీన్, జంగల్ నినాదం తో చేసిన పోరాటంలో అసువులు బాసి న అమరవీరుల స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తోందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ఆనాడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 44 ఏళ్ల కిందట ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో అమరులైన వారి స్మార కర్థం అమరవీరుల స్థూపం వద్ద ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆమె పాల్గొన్నారు.

ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జుపటేల్, ప్రేమ్‌సాగర్‌రావు, ఆదివాసీ సంఘాల నేతలతో కలిసి స్థూపం వద్ద ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పూజలు చేసి, పుష్పాంజలి ఘటించి అమరులకు ఘనంగా నివాళులర్పించారు. కాల్పుల్లో మృతి చెందిన 15 మంది అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అంజేశారు. ట్రైకార్ పథకం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారు.

అంతకుముందు ఉట్నూరులో ఆదివాసి యువకుల కోసం ఏర్పాటు చేసిన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఆదివాసులకు హక్కులతో పాటు వారి ఆశయాల సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల సమర శంఖం పూరించి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. మారుమూల ఆదివాసీ గూడేల్లో అభివృద్ధి పనులకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇంద్రవెల్లి అమరుల సంస్కరణ సభ నిర్వహణకు గత ప్రభుత్వాలు నిషేధజ్ఞలు విధించి, అమరులకు కనీసం నివాళులు అర్పించకుండా పోలీసులతో అడ్డుకున్నారని అన్నారు.

తమ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. పలు ఆదివాసీ గ్రామాలకు రహదారుల నిర్మాణం విషయంలో కేంద్రంతో మాట్లాడి అనుమతులు సాధిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్, మాజీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.