calender_icon.png 30 September, 2024 | 6:51 AM

సోయాకు మద్దతు సో..సో!

30-09-2024 12:14:42 AM

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట

క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,600

కానీ.. కొనుగోలు కేంద్రాల ఊసే లేదు !

మార్కెట్ వ్యాపారులు చెప్పిందే రేటు

ఎకరాకు రూ.25వేల పెట్టుబడి పెట్టి నష్టపోతున్న రైతులు

సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రకృతి కన్నెర్ర చేసి భారీ వర్షాలు కురిపించింది. పంటను దెబ్బతీసింది. పోనీయ్.. చేతికొచ్చిన పంటనైనా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందా? అంటే అదీ లేదు.

దీంతో సంగారెడ్డి జిల్లాలో సోయా సాగు చేస్తున్న రైతు నష్టాలు చవిచూడాల్సి వస్తున్నది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తగా 68,434 ఎకరాల్లో సోయా సాగైంది. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రధాన పంటల్లో అంతర పంటగా సోయాను సాగు చేశారు.

ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు  20 వేల ఎకరాల్లో  పంట దెబ్బతిన్నది. ప్రస్తుతం సోయా కు ప్రభుత్వం క్వింటాకు రూ.4,600 ప్రకటించగా, మార్కెట్‌లో వ్యాపారులు తేమ, పలుకు సాకులు చెప్పి ఆ ధరను రూ.4 వేలకు తగ్గిస్తున్నారు. 

నష్టపోతున్న రైతులు

ఒక ఎకరా సోయా సాగు చేసేందుకు తాము రూ.25 వేల చొప్పున ఖర్చు చేశామని, వ్యాపారులు క్వింటాకు రూ.4 వేలు ఇస్తే తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎకరానికి 10  12 క్వింటాల వరకు దిగుబడి  వస్తుందని, పంట చేతికొచ్చాక మార్కెట్‌లో మంచి ధర ఉంటేనే తాము కాస్త లాభాలు చూస్తామంటున్నారు.

ఉదాహరణకు ఒక రైతు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి  సాధిస్తే, ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం పంటను విక్రయించడం ద్వారా అతడికి రూ.46,000 ఆదాయం వస్తుంది. కానీ, మార్కెట్ వ్యాపారులు ధరను తగ్గిస్తుండడంతో రైతులకు రూ.40 వేల వరకే ఆదాయం వస్తున్నది.

ఇటీవల కురిసిన వర్షాలకు ఎకరాకు కేవలం 6 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, పంటకువ్యాపారులు క్వింటాకు రూ.4 వేల నుంచి రూ. 3 వేల చొప్పున ఇస్తారని, దీంతో తాము నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున ఖర్చు చేస్తే పెట్టుబడులైనా రాకపోతే తామెలా బతకాలని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

పట్టించుకోని మార్కెటింగ్‌శాఖ

జిల్లాలో ప్రభుత్వం ఇప్పటివరకు సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయలేదు. దీంతో రైతులు వ్యాపారులు చెప్పిన ధరకే పంటను జహీరా బాద్, జోగిపేట, నారాయణఖేడ్, బీదర్ మార్కెట్లలో  విక్రయిస్తున్నారు. కొందరైతే కర్ణాటకలోని బీదర్ మార్కెట్‌కు తరలించి అమ్ముతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు పంట నాణ్యత దెబ్బతినడంతో వ్యాపారులు తేమ, పలుకు పేరుతో ధర తగ్గిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై  రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి మద్దతు ధర ఇస్తూ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.