calender_icon.png 19 November, 2024 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డలకు ఆసరా

19-11-2024 02:27:42 AM

మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు అడుగులు

  1. సంక్షేమ పథకాలకు పెద్దపీట 
  2. ఉపాధి కల్పనతో ఆర్థికాభివృద్ధి 
  3. సామాజిక భద్రతతో భరోసా
  4. మాతా-శిశు పరిరక్షణకు చర్యలు
  5. నేడు వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించినది కాంగ్రెస్ పార్టీ. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, సంక్షేమ రంగాల్లో దేశం ఇంత పటిష్టంగా ఉండటంలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రగతి పథాన నడిపించింది.

అన్ని వర్గాల సాధికారతకు కృషి చేసింది. ముఖ్యంగా మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. అన్ని రంగాల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది. సామాజిక భద్రత, సాధికారత, ఉపాధి పరంగా, మాతా-శిశు సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమయంలో, దేశంలో అధికారంలో ఉన్న సమయంలోనూ మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో లాగానే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మహిళల సాధికారత థీమ్‌తో వేడుకలను నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మహిళల పట్ల వారి కున్న చిత్త శుద్ధిని నిరూపించుకుంటుంది. 

మహిళా సాధికారతకు..  

‘ఆశ’ పేరిట గ్రామీణ స్థాయిలో అందించే హెల్త్ సర్వీస్ కార్యక్రమం ద్వారా 70 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించింది. 2008లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టింది. మధ్య తరగతి విద్యార్థినులు, పనిచేసే మహిళల కోసం 11 వర్కింగ్ వుమెన్ హాస్టళ్లు, 27 వుమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేసింది. రాజీవ్ విద్యామిషన్ పథకంతో స్కాలర్‌షిప్ అందించి 60 లక్షల మంది విద్యార్థినులు పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 29 లక్షల పేద మహిళల పేరిట ఇళ్లు అందించింది. 

సామాజిక భద్రత 

స్వయం సహాయక సంఘాలు, వృద్ధాశ్రమాలు, డొమెస్టిక్ వర్కర్స్, స్వశక్తి మహిళలకు సామాజిక భద్రత పెన్షన్ అందించేందుకు ప్రారంభించిన అభయ హస్తం, జనశ్రీ బీమాయోజన ద్వారా కోటి మంది మహిళలు లబ్ధి పొందారు. గ్యాస్ సబ్సిడీ కింద 72 లక్షల కుటుంబాలు రూ.216 కోట్ల లబ్ధి పొందారు. బంగారు తల్లి గర్ల్ చైల్డ్ ప్రమోషన్ అండ్ ఎంపవర్మెంట్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.2500 చొప్పున 98,509 మంది పిల్లలకు లబ్ధి చేకూరింది. 

ఉపాధి కల్పనకు..

ఇందిరా క్రాంతి పథకం ద్వారా 1.83 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఉపాధి లభించింది. స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి మంది మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా సహకారం అందించింది. పావలా వడ్డీ పథకం ద్వారా 8.97 లక్షల ఎస్‌హెచ్‌జీలకు రూ.2,659 కోట్లు పంపిణీ చేసింది. 2011లో ప్రారంభించిన స్త్రీనిధి బ్యాంకు ద్వారా 5 లక్షల మంది మహిళలు ప్రతి సంవత్సరం రూ. 3 వేల కోట్లు లబ్ధి పొందారు. నిరుపేదలైన 7.78 లక్షల మంది మహిళలకు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్స్ ద్వారా రూ.1,302 కోట్ల సహకారం అందించింది. 

మాతా-శిశు సంరక్షణ లక్ష్యంగా 

జనని సురక్ష యోజన, అమ్మ కొంగు, మాతా-శిశు హెల్త్ కార్డుల ద్వారా మొత్తం 35 లక్షల మంది లబ్ధి పొందారు. మాతా-శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన 35,700 ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా 61,000 మంది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించింది. ఇందిరమ్మ అమృత హస్తం పథకం ద్వారా 4.6 లక్షల గర్భిణులకు పోషకాహారం అందించింది. 

జాతీయ స్థాయిలో మహిళల కోసం 

మహిళల అక్షరాస్యతను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల ద్వారా 2005-06లో 55.1శాతంగా ఉన్న మహిళల అక్షరాస్యత 2015-16 కల్లా 68.4 శాతంగా నమోదైంది. 2005-06 లో 15.1 శాతంగా ఉన్న బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్న మహిళల సంఖ్య 2015-16 కల్లా 53 శాతానికి చేరడమే వారు సాధించిన ఆర్థిక స్వతంత్రతకు నిదర్శనం.

మహిళల సాధికారత కోసం 2006లో మహిళా-శిశు సంబంధించిన ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం 1992లో జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు 2010లో రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడొలసెంట్ గర్ల్స్ పథకాన్ని ప్రారంభించింది.

స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం కల్పిస్తూ 1993 లో 73వ రాజ్యాంగ సవరణ చేసింది. సామాజిక భద్రత కల్పించడంలో భాగంగా మహిళలపై దాడులను నిరోధించేందుకు 2013లో అహింస మెసేంజర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

జనని సురక్ష యోజన పథకంలో భాగంగా 2005-06లో  ఏటా 7.39 లక్షల మంది లబ్ధి పొందగా, ఆ సంఖ్య 2013-14 కల్లా 1.06 కోట్లకు చేర్చింది. ఐసీడీఎస్ పథకం ద్వారా 10 కోట్ల మంది మాతా-శిశువులు లబ్ధి పొందగా వారికి సేవలందించడంలో భాగంగా 27 లక్షల మంది మహిళలు ఉపాధి పొందారు. 

మహిళలకు బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు 

గత పదేళ్లల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి చేసిందేమీ లేదు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మహిళలకు మంచిరోజులు వచ్చాయి. ఉచిత బస్సు ప్రయాణం, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు రూ.500 సబ్సిడీ, గృహిణులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను మహిళలకు కోసం అమలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. 

 కొండా సురేఖ, దేవాదాయశాఖ మంత్రి