calender_icon.png 19 September, 2024 | 7:44 AM

ఆదుకుంటం

07-09-2024 12:29:34 AM

వరద కష్టం హృదయ విదారకం

  1. వరద నష్టంపై ప్రధానికి నివేదిస్తా 
  2. త్వరలోనే అందరికీ సాయం అందిస్తం 
  3. నేనూ రైతునే.. రైతు కష్టాలు తెలుసు
  4. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విపత్తు నిధులు మళ్లించింది 
  5. ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి 
  6. శివరాజ్‌సింగ్ ఏరియల్ సర్వే 
  7. పాలేరులో రైతులతో ముఖాముఖి 
  8. సచివాలయంలో సీఎంతో భేటీ 
  9. వరద నష్టంపై సమీక్ష
  10. ఏపీతో సమానంగా నిధులివ్వండి: సీఎం రేవంత్.. కేంద్రసాయంపై అయోమయం

హైదరాబాద్/ఖమ్మం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకొంటామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. నష్టం అంచనా పూర్తయిన వెంటనే బాధితులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై వరదలపై సమీక్ష నిర్వహించారు.

వరద నష్టంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఏపీకి ఎంత సాయం ప్రకటిస్తే తెలంగాణకు కూడా అంత ఇవ్వాలని కోరారు. ఖమ్మంలో ఏరియల్ సర్వే అనంతరం శివరాజ్‌సింగ్ మాట్లాడుతూ.. వరద బాధితులకు ధైర్యం చెప్పేందుకు ప్రధాని నరేంద్రమోదీయే తనను ఇక్కడికి పంపారని తెలిపారు.

ధైర్యంగా ఉండండి

వరదల్లో పంటలు కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దని, కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. ‘నేనూ రైతునే. రైతుల కష్టాలు నాకు బాగా తెలుసు. తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటుంది. వరదలతో తీవ్రంగా నష్టోయిన తెలంగాణ రైతాంగానికి భరోసా ఇచ్చి ఆదుకునేందుకు ప్రధాని మోదీ నన్ను ఇక్కడకు పంపించారు. రైతులెవరూ అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. వరదలపై ప్రధానమంత్రికి నివేదిస్తాను.

ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి, జిల్లాలోని వరద బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు కార్యాచరణతో ముందుకెళతాం. భారీ వర్షాలకు పాలేరు, మధిర తదితర నియోజకర్గాల్లో పెద్ద ఎత్తున వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంట పొలాలు దెబ్బతిన్నాయి. రైతుల ఆవేదన నాకు అర్ధమైంది. పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. వరదల్లో పశువులు, ఇళ్లలోని సామాన్లు సహా సర్వం కోల్పోయారు. మేమంతా మీకు తోడుగా ఉన్నాం. ధైర్యంగా ఉండండి’ అని కోరారు.

నిధులు మళ్లించిన బీఆర్‌ఎస్ సర్కారు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన విపత్తు నిధులను వాడుకోలేక పోయిందని శివరాజ్‌సింగ్ చౌహాన్ విమర్శించారు. తామ రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకుని ఉంటే మళ్లీ కొత్తగా నిధులు వస్తాయని, వచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వం పసల్ భీమా యోజన పథకాన్ని అమలు చేయలేదని, కేంద్రం చేస్తానన్నా ఒప్పుకోలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేదని ఆరోపించారు.  

మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే

మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, ఖమ్మం నగరం, మున్నేరు శివారు ప్రాంతాలు, పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే నిర్వహించి వరదలతో దెబ్బతిన్న పంట పొలాలు, ఇళ్లను పరిశీలించారు.

ఖమ్మం నగరంలో మున్నేరు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను, పాలేరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పొలాలను హెలికాప్టర్ నుంచి పరిశీంచారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెం సమీపంలోని నానుతండాలో వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను, పాలేరులో సాగర్ కాల్వకు పడి న గండిని పరిశీలించి రైతులతో మాట్లాడా రు. తాము వరదల వల్ల సర్వం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదు కోకపోతే చావే శరణ్యమని రైతులు రోధించగా, కేంద్ర మంత్రి వారిని ఓదార్చారు.  

ఏపీతో సమానంగా నిధులివ్వండి 

భారీ వర్షాలు, వరద బీభత్సంతో రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలకు భారీ నష్టం జరిగిందని, అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించా లని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రులకు వరద నష్టం గురించి వివరించారు.

రూ.5,438 కోట్ల నష్టం

రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ. 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు  సీఎం రేవంత్ వివరించా రు. అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాలు వేసిన తరువాత ఈ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని వివరించారు. వరద నష్టంపై సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తోపాటు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పా రు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

తక్షణ సాయం చేయండి

తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని విన్నవించారు. ‘ఎస్డీఆర్‌ఎఫ్ నిధుల్లో 50 శాతం ఉపయోగిస్తే.. ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు వాడుకునేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేది.

2021 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు 100 శాతం ఎస్డీఆర్‌ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారు. గతంలో ఉన్నట్టుగా ఈ నిబంధనను సడలించాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు.

రాజకీయాలకు తావు లేదు

విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

ఛాయాచిత్ర పదర్శన

శుక్రవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన కేంద్ర మం త్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజ య్ సాయంత్రం హైదరాబాద్‌లోని సచివాలయానికి చేరుకున్నారు. వారికి సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్శంగా సచివాలయంలో ఏర్పాటుచేసిన వరద ప్రభావ, నష్టాన్ని తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. 

సీఎం సహాయ నిధికి పలువురి విరాళాలు

వరద బాధితులకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. జీఎంఆర్ గ్రూప్ తరఫున రూ.2.50 కోట్లను సీఎం సహాయ నిధికి ఆ సంస్థ ప్రతినిధులు అందించారు. అలాగే కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు కూడా తమ కంపెనీ తరఫున రూ.కోటిని విరాళంగా అందించారు. విర్కో ఫార్మా ప్రతినిధులు సీఎం రేవంత్‌ను కలిసి వారి ఫార్మా కంపెనీ తరఫున రూ.కోటిని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతరెడ్డి రూ.కోటి సహాయం అందించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర సాయంపై అయోమయం

వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.౩౪౪౮ కోట్లు కేటాయించిందని శుక్రవారం సాయం త్రం వార్తలు వచ్చాయి. ఈ సాయంపై ఏపీ బీజేపీ నేత పురందేశ్వరి కూడా ట్వీట్ చేశారు. అయితే అటు కేంద్ర కానీ.. ఇటు తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రు లు కానీ వరద సాయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయిన ఏపీ సీఎం చంద్ర బాబు కూడా వరద సాయంపై తనకేమీ సమాచారం లేదని చెప్పారు. ఇంకా నష్టంపై అంచనాలే వేయకుండా సాయమెలా వస్తుందని ఆయన ప్రశ్నించటం గమనార్హం.