వేతనాల పెంపు, పింఛను లేకపోవడం నుంచి ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు, సర్వీసుల క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం దేశంలోని చాలా రాష్ట్రాలలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. పీఎం -పోషణ్ అభియాన్ కింద డిజిటలైజేషన్‌ను పెంచడం పట్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంగన్వాడీల సంరక్షకుల పాత్ర డేటా కలెక్టర్ల పాత్రగా మారింది. వీరికి చెల్లించే గౌరవ వేతనమూ పీఎం -పోషన్ అభియాన్ కింద వివిధ యాప్‌లలోకి డేటా ఎంట్రీకి లింక్ చేశారు.
ఈ పనుల కోసం అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనం, హెల్పర్లకు రూ. 7 వేలు చెల్లిస్తున్నారు. తరువాతి వారిని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ పథకం కింద వలంటీర్లుగా పరిగణిస్తారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా, అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీడీఎస్ బడ్జెట్ కింద మొబైల్ పరికరానికి రూ. 8,000 ధరతో స్మార్ట్‌ఫోన్లను అందించారు. కానీ, వాటిని అప్‌డేట్ చేసిన స్పెసిఫికేషన్లతో ఒక్కో పరికరానికి రూ.10,000గా సవరించారు.
దేశమంతటా గత కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్న కార్యకర్తల సమస్యలన్నీ సార్వత్రికమైనవి. ప్రతి కొత్త మాడ్యూల్‌ను యాప్‌లోకి చేర్చడంతో పని మొత్తం పెరుగుతుండగా, వేతనాలు నిలిచిపోతున్నాయి. అంగన్వాడీ వర్కర్లు పూర్తి సమయం పని చేయవలసివస్తుంది. ఈ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నా సంక్షేమం పొందలేకున్నారు. అదే సమయంలో వారిని వలంటీర్లుగా పరిగణిస్తున్నారు.
- డా. ముచ్చుకోట సురేష్ బాబు