calender_icon.png 4 January, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన గుడ్లు సరఫరా చేయండి

09-07-2024 02:18:56 AM

అంగన్వాడీలకు నాణ్యత లేని గుడ్ల సరఫరా కథనాలపై మంత్రి సీతక్క ఫైర్

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాం తి): కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని గుడ్లు పంపిణీ కావడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సీరియస్ అయ్యారు. పలు అంగన్వాడీ  కేంద్రాల్లో నాసిరకం వస్తువులు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదే శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లను పంపిణీ చేస్తే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీలకు నాసిరకం గుడ్లు, వస్తువులు సర ఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు వస్తువులు సరఫరా చేసే కాంట్రా క్టులను గత ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని, అందుకే కాంట్రాక్టుల గడువును తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.అంగన్వాడీ  కేంద్రాలకు వస్తువులు సరఫరా చేసే టెండర్ల నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచే దిశగా మరికొన్ని ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. అంగన్వాడీలలో భోజన నాణ్యత పై రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. సెర్ప్ ద్వారా ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరు, బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు.  గత ప్రభు త్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు కేంద్ర నిధులను సరిగా వాడుకోలేకపోయామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.