- అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
- రూ.95.75 లక్షల విలువైన మాల్ స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ చాటునా ఎండు గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను బాలా నగర్ ఎస్వోటీ బృందం, శామీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 95.75 లక్షల విలువైన 243 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హర్యానాకు చెందిన భజరంగ్ ప్రస్తుతం బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు.
హైదరాబాద్‌లో స్టేట్ కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాపారం ప్రారంభించాడు. మరో నిందితుడు గజేందర్‌సింగ్ బోయిన్‌పల్లిలో నివాసం ఉంటూ మొ బైల్ షాప్, సెవెన్ హిల్స్ ప్యాకర్స్ అండ్ మూ వర్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. భజరంగ్‌కు నరేష్ చింగ్లా, కపిల్‌శర్మ స్నేహితులు.
ఒడిశా టూ మహారాష్ట్ర..
భజరంగ్, బలరాం అనే డ్రగ్ పెడ్లర్ సహచరుడు. ప్రస్తుతం అతడు డ్రగ్ కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. బలరాంకు డ్రగ్ సరఫరా చేసే ఒడిశాకు చెందిన శామ్యూల్ అలియాస్ సుభాష్‌తో భజరంగ్‌కు పరిచయం ఏర్పడింది. జూలైలో భజరంగ్, బలరాంతో కలిసి 300 కేజీల గంజాయిని హర్యానాకు సరఫరా చేశాడు. తర్వాత పాత కేసుల్లో బలరాంకు జైలు శిక్ష పడింది. బలరాం జైలుకు వెళ్తుండగా తన మొబైల్‌ను భజరంగ్‌కు ఇచ్చి రిసీవర్ల వివరాలు చెప్పాడు.
దీంతో భజరంగ్ డ్రగ్ పెడ్లర్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో రిసీవర్లు రాజేష్ అలియాస్ రాకేష్ గంజాయి దందా కు జత కట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న భజరంగ్, నరేష్ చింగ్లా, కపిల్ శర్మ, రాజస్థాన్‌కు చెందిన గజేందర్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.