రోజుకు 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా జరగాలి..
17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి తొలగించాలి
సింగరేణి సిఎండి బలరాం ఆదేశాలు..
మణుగూరు (విజయక్రాంతి): పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజు 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలని సంస్థ సీఎం బలరాం ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవికాలం సమీపిస్తుండడంతో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏరియాలో కూడా ప్రణాళిక బద్ధంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రోజుకు 11 రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలని దీంతోపాటు సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందించాలని స్పష్టం చేశారు.
బొగ్గు సరఫరా విషయంలో రైల్వే విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కొత్తగూడం ఏరియా మెరుగైన ఉత్పత్తి సాధించడంపై ఏరియా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న ఏరియాలు పుంజుకొని పనిచేయాలన్నారు. అదేవిధంగా రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బార్డర్ మట్టిని తొలగించాలని నాణ్యత రక్షణతో కూడిన ఉత్పత్తికి అన్ని ఏరియాల జిఎంలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సింగరేణి భవన్ నందు సీఎండీతోపాటు సీఎం కోఆర్డినేషన్ ఎస్డిఎం సుభాని, మణుగూరు ఏరియా జీఎం రామచందర్, మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం నుంచి ఇంచార్జ్ జిఎం టి లక్ష్మీపతి గౌడ్ ఏరియా అధికారులు పాల్గొన్నారు.