హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు, సమాజ నిర్మాతలు అని, యువత శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా, ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలోని ఆజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల టాయిలెట్ లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రుతుక్రమం ప్రకృతి పరమైన చర్య అని దాని గురించి అపోహ, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు వీడనాడాలని అన్నారు. నేటి బాలలే భావి భారత పౌరులని, భవిష్యత్ నిర్మతలని అన్నారు.
యువత శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా అజాంపూర ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్ లో బాలికల కోసం ఇన్సినరేటర్ (నాప్కిన్ దహన యంత్రం) సురక్షితమైన రుతుస్రావం కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ యంత్రమును బాలికలు ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఏమైనా మరమ్మతులు వస్తే వెంటనే తెలియజేసి బాగు చేయించాలన్నారు. ఆజంపుర పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 384 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో హెల్త్ క్లబ్ ఏర్పాటు కు ఈ పాఠశాల రోల్ మోడల్ గా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ఆర్.రోహిణి, ప్రత్యేక అధికారి జిఎం ఇండస్ట్రీస్ పవన్ కుమార్, డిప్యూటీ ఐఓఎస్ నిజాముద్దీన్, డిప్యూటీ ఈవో విజయ, ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, యంగిస్తాన్ ఫౌండేషన్ అరుణ్ ఎలమటి, టిసిఐసి కృతిక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.