న్యూయార్క్: వరుస విజయాలతో విజృంభిస్తున్న టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సూపర్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య అమెరికాపై విజయం సాధించింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న న్యూయార్క్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. మన బౌలర్లు విజృంభించడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. స్టీవెన్ టేలర్ (24; 2 సిక్సర్లు), నితీశ్ కుమార్ (27; 2 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (0), రోహిత్ శర్మ (3) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబే (35 బంతుల్లో 31 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవల్కార్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అర్ష్‌దీప్ కెరీర్ బెస్ట్ స్పెల్
అనూహ్య బౌన్స్, ఊహించని స్వింగ్‌తో ఊరిస్తున్న న్యూయార్క్ పిచ్‌పై మన బౌలర్లు ఆరంభం నుంచే అదరగొట్టారు. బౌలింగ్ దాడిని ప్రారంభించిన అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ తొలి బంతికే జహంగీర్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి ఓవర్ చివరి బంతికే ఆండ్రీస్ గౌస్ (2) కూడా వెనుదిరగడంతో అమెరికా వెనుకంజలో పడింది. ఈ దశలో వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అమెరికా బ్యాటర్లు.. ఆచితూచి బ్యాటింగ్ చేయగా స్టీవెన్ టేలర్ కొన్ని షాట్లు ఆడాడు. దీంతో ఇక కుదురుకున్నట్లే అనుకుంటున్న దశలో కెప్టెన్ ఆరోన్ జోన్స్ (11)ను పాండ్యా బుట్టలో వేసుకున్నాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన టేలర్‌ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. నితీశ్ కుమార్ విలువైన పరుగులు సమకూర్చాడు.
చివర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ నితీశ్‌ను ఔట్ చేశాడు. స్కేర్ లెగ్‌లో సిరాజ్ పట్టిన సూపర్ క్యాచ్‌కు నితీశ్ పెవిలియన్ బాటపట్టాడు. కోరె అండర్సన్ (15)ను పాండ్యా ఔట్ చేయగా.. హర్మీత్ సింగ్ (10)ను అర్ష్ డగౌట్‌కు చేర్చాడు. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నిప్పు లు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో వికెట్ పడగొట్టలేకపోగా.. హార్దిక్ పాండ్యా పేస్ ఆల్‌రౌండర్ పాత్రను మరోసారి సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఇక మరో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఒక ఓవర్ వేసి 11 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు. అక్షర్‌కు ఓక వికెట్ దక్కింది. అర్ష్‌దీప్ తన కోటా 4 ఓవర్లలో 17 డాట్ బాల్స్ వేసి కేవలం 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. తొలి 10 ఓవర్లలో 42 పరుగులు చేసిన అమెరికా.. చివరి 10 ఓవర్లలో 68 పరుగులు రాబట్టింది.