87 పరుగులతో అజేయ ఇన్నింగ్స్
- వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
- టీ20 ప్రపంచకప్ సూపర్-8
* టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ గర్జించింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై విండీస్ బౌలర్లను తుత్తునీయలు చేస్తూ ఫిల్ సాల్ట్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లీష్ జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఆతిథ్య వెస్టిండీస్ మొదట బ్యాటింగ్‌లో మంచి స్కోరే చేసినా.. సాల్ట్ విజృంభణతో చివరకు కరీబియన్లకు నిరాశ తప్పలేదు. దీంతో సూపర్ ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది.
సెయింట్ లూసియా: పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్ భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జాన్సన్ చార్ల్స్ (34 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పూరన్ (32 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్), పావెల్ (17 బంతుల్లో 36; 5 సిక్సర్లు) రాణించగా.. చివర్లో రూథర్‌ఫోర్డ్ (15 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్, ఆర్చర్, రషీద్, మోయిన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (47 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెయిర్ స్టో (26 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), అలీ (13) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో రసెల్, చేజ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్‌ను గెలిపించిన ఫిల్ సాల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.