calender_icon.png 7 November, 2024 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ - 8 షురూ..

19-06-2024 12:14:00 AM

టీ20 ప్రపంచకప్‌లో తొలి అంకం దిగ్విజయంగా ముగిసింది. నేటి నుంచి సూపర్ సంగ్రామానికి తెరలేవనుంది.  ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక్కడి నుంచి మరొక లెక్క. మేటి జట్ల మధ్య ఇవాళ్టి నుంచి అసలు పోరాటం మొదలుకానుంది. ఎవరి సత్తా ఎంతనేది ఇప్పుడు బయటపడనుంది. లీగ్ దశలో 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడాయి. అయితే గతానికి భిన్నంగా ఈసారి టీ20 ప్రపంచకప్ జరిగింది.

భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ ఉత్కంఠకు ఢోకా లేకుండా పోయింది. లీగ్ దశలోనే రెండు సూపర్ ఓవర్ల ద్వారా ఫలితం తేలగా.. చాలా మ్యాచ్‌ల్లోనూ ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడింది. పసికూనలనుకున్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తూ అద్భుత విజయాలు సాధించాయి. మాజీ చాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకతో పాటు న్యూజీలాండ్‌లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గ్రూప్ దశలోనే వైదొలిగాయి. మరి సూపర్ ఎలాంటి సంచలనాలు నమోదవుతాయనేద చూడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్ ఎనిమిది జట్ల మధ్య పోరాటం మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం..!

విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: పొట్టి ప్రపంచకప్‌లో నేటి నుంచి సూపర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరగా.. రెండు గ్రూపులుగా విభజించారు.  నేటి నుంచి జూన్ 25 వరకు 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ టీమిండియా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉండగా.. గ్రూప్ బి నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లండ్‌లు తలపడనున్నాయి.

సూపర్ ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుండగా.. రెండు గ్రూపుల్లో నుంచి ఎక్కువ విజయాలు సాధించిన 2 జట్లు సెమీస్‌కు ప్రవేశించనున్నాయి. కాగా లీగ్ దశ మ్యాచ్‌లకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా.. సూపర్ నుంచి మాత్రం అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోనే జరగనున్నాయి.

ఆ ‘ఒక్కటి’ మినహా

లీగ్ దశలో టీమిండియా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో 7 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ అడుగుపెట్టింది. సూపర్ గ్రూప్ టీమిండియాకు ఆస్ట్రేలియా నుంచి గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశముంది. జూన్ 24న ఆసీస్‌తో టీమిండియా తలపడనుంది. అయితే అంతకముందే అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లు ఆడనుండడం రోహిత్ సేనకు కలిసొచ్చే అంశం.

ఈ రెండింటిలో విజయాలు సాధిస్తే ఆసీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ భారత్‌కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ సూపర్ మూడు మ్యాచ్‌లు గెలవడంపైనే టీమిండియా దృష్టి సారించనుంది. లీగ్ దశలో భారత్ తమ మ్యాచ్‌లన్నీ న్యూయార్క్ వేదికగా ఆడడం ప్రతికూలం. ఎందుకంటే ఆసీస్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లు అమెరికాతో పాటు వెస్టిండీస్ పిచ్‌లపైనా మ్యాచ్‌లు ఆడాయి. గ్రూప్ దశలో అఫ్గానిస్థాన్.. న్యూజీలాండ్ లాంటి మేటి జట్టుకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది.

బంగ్లాదేశ్ కూడా తమదైన రోజున టీమిండియాను ఓడించే సత్తా ఉంది. ఇక మాజీ చాంపియన్ ఆసీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐసీసీ టోర్నీలంటే చెలరేగిపోయే ఆసీస్‌ను నిలువరించడం టీమిండియాకు కష్టసాధ్యం. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఇప్పుడు వచ్చింది. మరి దీన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందేమో చూడాలి. 

బ్యాటింగ్ సంగతేంటి?

ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాలపై విజయాలు సాధించినప్పటికీ న్యూయార్క్ పిచ్‌లు బౌలర్లకు విపరీతంగా సహకరించాయి. దీంతో మన బ్యాటింగ్ పవర్ పూర్తిగా బయటపడలేదు. కెప్టెన్ రోహిత్ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ ఇంతవరకు సరైన బోణీ చేయలేదు. లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ దారుణం గా విఫలమయ్యాడు. మరి సూపర్ కోహ్లీ తన బ్యాట్‌కు పదును పెడతాడేమో చూడాలి. రిషబ్ పంత్ ఫామ్‌లో ఉండగా.. అమెరికాతో మ్యాచ్‌లో సూర్య, దూబేలు టచ్‌లోకి వచ్చారు. ఆల్‌రౌండర్లు పాండ్యా, జడేజా, అక్షర్‌లు రాణించాల్సి ఉంది.