calender_icon.png 23 April, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ప్రాణాలు బలిగొంటున్న ‘వడదెబ్బ’

23-04-2025 04:29:29 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): వడదెబ్బ కారణంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ప్రాణాలు వదులుతున్న రైతుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంట దిగుబడులు చేతికి అందవొస్తున్నాయి. ధాన్యం, మొక్కజొన్న నూర్పిడి చేసి, విక్రయానికి సిద్ధం చేయడానికి రైతులు కుటుంబ సభ్యులతో కలిసి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. దీనితో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో వడదెబ్బకు గురై రైతులు తాము నమ్ముకున్న పంటల వద్ద ప్రాణాలు విడుస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం ఆరబోసి వడదెబ్బకు గురై మహిళా రైతు అనుమాండ్ల ప్రేమలత ఇటీవల మరణించింది. ఈ ఘటన మరువక ముందే మంగళవారం నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో రైతు బిర్రు వెంకన్న తాను పండించిన వరి పంటను నూర్పిడి చేసి ధాన్యాన్ని ఆరబెట్టి నేర్పుతున్న క్రమంలో ధాన్యం రాశి పైనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు రైతులు వడదెబ్బ కారణంగా మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.