calender_icon.png 23 October, 2024 | 12:58 AM

సుంకిశాల పాపం గత ప్రభుత్వానిదే

09-08-2024 12:47:51 AM

  1. బీఆర్‌ఎస్ హయాంలోనే ఆ గోడ నిర్మాణం
  2. గోదావరితో పాటు కృష్ణనూ వదలని బీఆర్‌ఎస్
  3. నాణ్యత లోపంతోనే మేడిగడ్డ, సుంకిశాల ప్రమాదం
  4. విద్యుత్ శాఖలో త్వరలో పదోన్నతులు, బదిలీలు 
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులాగే కృష్ణా నదిపై కూడా లోపభూ యిష్టమైన డిజైన్లతో ప్రాజెక్టులు నిర్మించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము నీటిపాలు చేసిందని, అనేక అవినీతి పాపాలకు పాల్పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్ అవినీతికి కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు బలయ్యాయని, తాజాగా కృష్ణా నదిపై ఉన్న సుంకిశాల పంపింగ్ కేంద్రం గోడ కూలిందని, మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటదోనని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ సుంకిశాల ఘటనపై విచారణ జరిపి దోషులెవరో తేలుస్తా మని ప్రకటించారు. ‘నిలువునా విరిగిపడిన సుంకిశాల గోడ’ అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందిస్తూ.. ‘ఈ నిర్మాణం మేం కట్టింది కాదు.. మేం కట్టించింది అంతకంటే కాదు. ఇది ముమ్మాటికి తమరి పుణ్యమే’ అని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ప్రజలు ఎన్నికల్లో ఇప్పటికే బుద్ధి చెప్పినా మారడంలేదని దుయ్యబట్టారు. సుంకిశాలలో గోడ కూలిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. 

త్వరలో పదోన్నతులు, బదిలీలు 

విద్యుత్ శాఖలో అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలు త్వరలోనే చేపడతామని భట్టి తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. విద్యుత్ శాఖ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని.. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా విద్యుత్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని కొనియాడారు. గ్రేటర్ పరిధిలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా వంటి శాఖలతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ విపత్తుల నిర్వహణ చేపడతారని తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని సూచించారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి అనేక సాఫ్ట్‌వేర్, ఫార్మా, బయో తదితర కంపెనీలు వస్తున్నాయని, వీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. 

పేదల భూములు వారికే చెందాలి 

ఇందిరాగాంధీ కాలంలో పేదలకు పంచిన భూములను తిరిగి అర్హులైన వారికే పంచుతామని భట్టి విక్రమార్క తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్‌గూల్ రైతులు గురువారం ప్రజాభవన్‌లో భట్టిని కలిసి తమ భూములు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. ఇందిరమ్మ కాలంలో సంక్రమించిన అసైన్డ్ భూములను కాజేసేందుకు జీపీఏలు, కోర్టు ఉత్తర్వుల ద్వారా కొందరు ప్రైవేట్ వ్యక్తుల యత్నిస్తున్నారని తెలిపారు. బలవంతంగా తమను భూముల నుంచి ఖాళీ చేయించాలని గతం లో ప్రయత్నించగా, తమకు అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అండగా నిలిచారని చెప్పారు.

ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు, కొందరు అధికారులు, పోలీసుల సాయంతో తమను భూమి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెయ్యి కుటుంబాలు ఈ భూమిపై ఆధారపడి ఉన్నాయని వివరించారు. బాధితులందం నిరుపేదలమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారమని, హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టు తిరిగే శక్తి తమకు లేదని వాపోయారు. రైతుల వద్ద ఉన్న సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని డిప్యూటీ సీఎం రైతులకు సూచించారు. సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వం పరంగా న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.  

పెండింగ్ డీఏలు విడుదల చేయాలి

పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు కేంద్రం నిర్ణీత గడువులోగా కరువు భత్యం మంజూరు చేస్తోందని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలోనూ వేతన జీవులకు కరువు భత్యం వెంటనే మంజూరు చేయాలని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్ గురువారం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. జూలై 2022 నుంచి నాలుగు విడుతలకు సంబంధించిన 14.56 శాతం డీఏ మంజూరు చేయాల్సి ఉండగా, నేటికీ ఉత్తర్వులు జారీ చేయలేదని మంత్రికి వివరించారు. దీనికితోడు ఉపాధ్యాయుల బిల్లులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆర్థికశాఖ పరిధిలో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో టీచర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, బిల్లులు మంజూరు చేయాలని కోరారు.