calender_icon.png 28 October, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకిశాల తప్పు బీఆర్‌ఎస్‌దే

10-08-2024 01:52:04 AM

  1. కేటీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
  2. ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేపడుతాం
  3. ఆగస్టు 15న రాజీవ్ కెనాల్‌ను సీఎం ప్రారంభిస్తారు
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9(విజయక్రాంతి): సుంకిశాలకు సంబంధించిన ఘటన లో పొరపాటును ఒప్పుకొని  తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా  పర్యటనలో ఉన్న ఆయన స్నానాల లక్ష్మీపురంలో మీడియాతో మాట్లాడారు. సుంకిశాల ఘటనతో కృష్ణానదిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మిం చిన ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టులను గత ప్రభుత్వమే నిర్మించింది. నీళ్లు రాకుండానే కాళేశ్వరం కుంగిపోయిందని, నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగిందన్నారు. నాగార్జునసాగర్ డెత్ స్టోరేజ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే మరేం వస్తాయని ఎద్దేవాచేశారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్స్ కట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాదా అని ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు కట్టిన ప్రదేశం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పినా వినకుండా ఆనాటి ప్రభుత్వం నిర్మించిందని, ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నామన్నారు.

ఇంజినీర్లు చెప్పింది కాదని కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం కట్టినందుకే కుంగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులకు రీడిజైన్ పేరుతో ఇరిగేషన్ శాఖను బీఆర్‌ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. రూ.1,450 కోట్లతో పూర్తి కావా ల్సిన రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరుమార్చి రూ.23 వేల కోట్లకు అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసిందన్నారు. సీతారామ ప్రాజెక్టుపై రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టిన ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వదన్నారు.

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్‌గాంధీ సైతం ప్రస్తావించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు వృథా కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజినీర్లతో కలిసి రాజీవ్‌గాంధీ లింక్ కెనాల్‌ను ప్రతిపాదించామన్నారు. కేవలం రూ.75 కోట్ల వ్యయంతో ఈ కెనాల్‌ను మూడు నెలల్లో పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు.

ఆగస్టు 15న వైరా పట్టణంలో కెనాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సంపూర్ణ రుణమాఫీ అమలు చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. జూలై 18న రుణమాఫీ ప్రారంభించి రెండు విడుతల్లో 16.29 లక్షల రైతుల ఖాతాల్లో రూ.12,298 కోట్లు జమ చేశామన్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి సభకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని, వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.