వ్యోమగామి భర్త మైకేల్ విలియమ్స్
వాషింగ్టన్, ఆగస్టు 11: వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకున్న భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి ఆమె భర్త మైకేల్ విలియమ్స్ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘అంతరిక్షమే ఆమెకు ఇష్టమైన ప్రదేశం. ఒకవేళ అక్కడ ఎంతకాలమైనా ఉండాల్సి వచ్చినా ఆమె అక్కడ సంతోషంగా ఉంటారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. బుచ్ విల్‌మోర్‌తో కలిసి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమ నౌకలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్.. ఆ నౌకలో హీలియం లీక్ కావటంతో అక్కడే చిక్కుబడి పోయారు. వారు గత జూన్ 14వ తేదీనే భూమికి తిరిగి రావాల్సి ఉంది. హీలియం లీక్ కారణంగా పలుసార్లు తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ఇక వీరు 2025వ సంవత్సరంలోనే భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల నాసా ప్రకటించింది.