20-03-2025 01:52:12 AM
తొమ్మిది నెలల ఉత్కంఠకు తెర
వాషింగ్టన్, మార్చి 19: అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగారు. వీరిని అంతరిక్షం నుంచి భూమ్మీదకు తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ మిషన్ తీవ్ర ఉత్కంఠ నడుమ ఎటువంటి ఆటంకం లేకుండా భూమ్మీదకు దిగింది.
వీరి రాక కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉత్కంఠగా ఎదురుచూశారు. వారం రోజుల పర్యటన కోసం నిరుడు జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల 286 రోజుల పాటు అక్కడే గడిపారు.
క్రూడ్రాగన్ సముద్ర జలాల్లో దిగగానే.. రికవరీ సిబ్బంది స్పీడ్ బోట్‌లో అక్కడకు వెళ్లి.. వ్యోమనౌకను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ వ్యోమనౌకలో ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
కాసేపు టెన్షన్.. టెన్షన్
మంగళవారం ఉదయమే క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత ఐఎస్‌ఎస్‌తో వ్యోమనౌక అన్‌డాకింగ్ కూడా విజయవంతంగా పూర్తి కావడంతో ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తారని అంతా అనుకున్నారు. కానీ భూ వాతావరణంలోకి వ్యోమ నౌక వచ్చిన తర్వాత అసలు సవాలు మొదలవుతుందని మొదటి నుంచే పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన విధంగానే జరిగింది.
భూ వాతావరణంలోకి క్రూ డ్రాగన్ ప్రవేశించిన వేగానికి ఏర్పడిన రాపిడి కారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడి వ్యోమ నౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దీంతో కొంత సేపు ఉత్కంఠ నెలకొంది. అంతే కాకుండా కొద్ది సేపు వ్యోమనౌకతో కమాండ్ సెంటర్ కమ్యూనికేషన్ కూడా తెగిపోయింది. కానీ కొద్ది సేపటి తర్వాత మరలా వ్యోమనౌకతో కమ్యూనికేషన్ ఏర్పడటంతో అంతా ఆనందించారు.
ఇక వ్యోమనౌక సాగరానికి దగ్గరగా చేరుకోగానే రెండు పారాచూట్స్ తెరుచుకున్నాయి. ఆ పారాచూట్స్ వ్యోమనౌక వేగాన్ని తగ్గించడంలో విజయవంతం కావడంతో నౌక వేగం పూర్తిగా తగ్గిపోయి.. అది నెమ్మదిగా సముద్ర జలాల్లో దిగింది. వెంటనే అక్కడ ఉన్న రికవరీ సిబ్బంది స్పీడ్ బోట్లలో వెళ్లి వ్యోమనౌకను భూమ్మీదకి తీసుకొచ్చి.. వ్యోమనౌకలో ఉన్న వ్యోమగాములను జాగ్రత్తగా బయటకు తీశారు. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యోమగాములు ఆనందం వ్యక్తం చేశారు.
సునీతకు డాల్ఫిన్ల స్వాగతం..
సునీతా విలియమ్స్ భూమికి చేరుకోగానే.. మొదటగా ఆమెకు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. వ్యోమనౌక సముద్ర జలాల్లో దిగిన తర్వాత ఆ ప్రదేశంలో రికవరీ ప్రక్రియ కొనసాగుతుండగా.. అక్కడ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు కనిపించాయి.
మాటిచ్చాం.. నిలబెట్టుకున్నాం: వైట్ హౌస్
9 నెలల నిరీక్షణ తర్వాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమ్మీదకు క్షేమంగా చేరడంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం ‘వైట్ హౌస్’ స్పందించింది. ‘అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొస్తామని అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన మాటను నెరవేర్చారు’ అని వైట్ హౌస్ ఎక్స్‌లో పేర్కొంది.
సునీత ఓ మార్గనిర్దేశకురాలు: మోదీ
వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను మార్గనిర్దేశకురాలు, ఐకాన్ అని ప్రధాని మో దీ ఆకాశానికెత్తారు. వ్యోమగాములు భూ మ్మీదకు చేరిన సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘క్రూ 9కు స్వాగతం. సునీత విలియమ్స్, క్రూ 9 సభ్యులను భూమి ఎంతో మిస్ అయింది. పట్టుదల అంటే ఏంటో వ్యో మగాములు మరోమారు మనకు చూపించారు. వారు చూపిన తెగువ కోట్లాది మంది కి స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు.
అంబరాన్నంటిన సంబురాలు
సునీత పూర్వీకుల గ్రామంలో సంబురా లు అంబరాన్నంటాయి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఝూలాసన్‌లో సునీత పూర్వీకులు నివాసం ఉంటుండగా.. అక్కడ టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నా రు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లోనే ఝూలాసన్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
త్వరలోనే భారత్‌కు..
సునీత త్వరలోనే భారత్‌లో పర్యటించనుందని ఆమె మరదలు ఫాల్గుని పాండ్యా తెలిపారు. ‘కచ్చితమైన తేదీలు చెప్పలేను. కానీ సునీత త్వరలోనే భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సంవత్సరమే ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది. ఆమె మా అందరికీ రోల్ మోడల్. కుంభమేళా సంబంధించిన ఫొ టోలు పంపమని అడిగారు.’ అని తెలిపారు.
సునీతకు ఈ ఇబ్బందులు తప్పవు!
గడిచిన తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్‌కు కొద్ది రోజుల దాకా పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజమే. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం, నిలబడటంలో సమస్యలు, దృష్టి లోపాలు, స్థిరంగా ఉండటం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నపుడు అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి కదిలేందుకు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం రాదు. కానీ భూమ్మీద మాత్రం ఏదైనా పని చేసేందుకు అక్కడికన్నా ఎక్కువగా శ్రమించాలి. వ్యోమగాముల ఎముకల్లో సాంద్రత కూడా తగ్గిపోతుంది.
ఇది కూడా వారికి అనేక సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. వారిలో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎముకల సాంద్రత సాధారణ స్థితికి చేరుకునేందుకు నాలుగేండ్ల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇక కండరాల విషయానికి వస్తే అవి కూడా ఎక్కువగా బలహీనపడతాయి. రోదసిలో మనం గడిపిన సమయాన్ని బట్టి కండరాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ లెక్కన సునీతా విలియమ్స్‌కు కండరాల సమస్యలు కూడా వేధించొచ్చు.
దృష్టి లోపం..
వ్యోమగాములు రోదసి నుంచి భూమ్మీదకు తిరిగొచ్చాక వారికి కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక వారు భూమ్మీద స్థిరంగా నడిచేందుకు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది. మెదడులో గందరగోళ పరిస్థితి ఏర్పడే పరిస్థితిని ‘స్పేస్ సిక్‌నెస్’ అని అంటారు. దీని వల్ల వాంతులు, కండ్లు తిరగడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి.
కేవలం స్పేస్ సిక్‌నెస్ మాత్రమే కాకుండా గ్రావిటీ సిక్‌నెస్ కూడా వారిని వేధిస్తుంది. పాదాల్లో ఏర్పడ్డ మార్పుల కారణంగా వ్యోమగాములు నడిచేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఉన్న రేడియేషన్ వల్ల వ్యోమగాముల శరీరంలో తెల్లరక్తకణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా జరగడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి చాలా మేర క్షీణిస్తుంది.
స్పందించిన మస్క్
సునీతా విలియమ్స్ భూమ్మీదకు రావడంతో ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ వీరిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని మస్క్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యోమగాములకు స్వాగ పలుకుతూ వారి ఫొటోలను షేర్ చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన వ్యోమగాముల ఆరోగ్యం కుదట పడ్డాక ఓవల్ ఆఫీసుకు పిలుస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.