calender_icon.png 26 February, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మజాకా’: సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

26-02-2025 10:23:39 AM

చిత్రం: మజాకా

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూవర్మ, అన్షు, మురళీశర్మ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది తదితరులు

నిర్మాణం: రాజేశ్ దండ‌

దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

సంగీతం: లియోన్ జేమ్స్

విడుదల: 26-02-2025

సందీప్‌కిషన్ 30వ సినిమా అని.. త్రినాథరావు నక్కిన దర్శకత్వం అంటూ ‘మజాకా’ చిత్రానికి ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. రావు రమేష్, అన్షు జోడీతో సినిమాపై అంచనాలను పెంచేశారు. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ‘మజాకా’ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. 

కథేంటంటే: వెంకటరమణ (రావు రమేష్‌), కృష్ణ (సందీప్ కిష‌న్) తండ్రీ కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు లేక‌పోవ‌డంతో వీళ్లను ఎవరూ తమ ఇంట శుభకార్యాలకు ఆహ్వానించరు. కనీసం వీరింట్లో పని చేసేందుకు పని మనుషులు కూడా రారు. దీంతో తమ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో చూసుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆశ. కొడుక్కి పెళ్లి చేద్దామంటే ఎవరూ పిల్లనివ్వడానికి ఇష్టపడరు. తనే ముందుగా వివాహం చేసుకుంటే అప్పుడు కోడల్ని తెచ్చుకోవచ్చని వెంకట రమణ భావిస్తాడు. ఈ క్రమంలోనే బస్టాప్‌లో ఒక అమ్మాయిని చూస్తాడు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. తండ్రి ఒకమ్మాయికి లైన్ వేస్తుంటే.. కొడుకు మరో అమ్మాయికి లైన్ వేస్తాడు. తండ్రీకొడుకులు ప్రేమ లేఖలు రాయడం.. ప్రేయసి కోసం తండ్రి బస్టాప్‌ల చుట్టూ తిరగడం జరుగుతుంటుంది. ఒకరి ప్రేమ ఒకరికి ఎప్పుడు తెలిసింది? వీరిద్దరి పెళ్లి జరిగింది? ఆ తరువాత కథ ఏ మలుపులు తీసుకుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

సినిమా ఎలా ఉందంటే.. ఈ సినిమాను దర్శకుడు త్రినాథరావు ఏ దృష్టితో తీశాడో ముందుగా అంతు పట్టదు. కొడుకుతో పాటు తండ్రి ప్రేమలేఖలు రాయడం.. బస్టాప్‌ల చుట్టూ తిరగడం.. ప్రియురాలిని మెప్పించడం కోసం నానా తంటాలు పడటం చూస్తే వెగటుగా అనిపిస్తుంది. తండ్రి ఎప్పుడూ పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడుతూ.. వారి కోసం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు రియల్ లైఫ్‌లో.. కానీ ‘మజాకా’లో తండ్రి అనే క్యారెక్టర్‌ను ఒక బఫూన్‌ను చేశారు. డీసెంట్‌గా వ్యవహరించాల్సిన పాత్రను ప్రియురాలి కోసం బస్టాప్‌ల చుట్టూ తిరిగేలా దర్శకుడు చేశాడు. కామెడీ కోసం అయితే కొడుకు పాత్రను వీలైనంత మేర వాడుకోవచ్చు. కానీ తండ్రి పాత్రతో ఇలాంటి విన్యాసాలు చేయించడం.. అసభ్యానికి పరాకాష్టలా అనిపిస్తుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ తమ ప్రియురాళ్ల కోసం ఒకే ఇంటికి వెళ్లి దొరికిపోవడం మరింత చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా తండ్రి పాత్రను అసహ్యంగా తీర్చి దిద్ది సభ్య సమాజానికి ‘మజాకా’ మేకర్స్ ఏం సందేశం ఇవ్వాలనుకున్నారో అర్థం కాలేదు.