calender_icon.png 17 November, 2024 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సండే హైడ్రా డే

09-09-2024 05:52:34 AM

  1. మూడు జిల్లాల పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
  2. ఆదివారం ఉదయం 5 గంటల నుంచే కూల్చివేతలు షురూ
  3. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి/పటాన్‌చెరు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఆదివారం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ సమీపంలోని మూడు జిల్లాల పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులను ఆదివారం ఉదయం ౫ గంటలకే ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో పెద్ద చెరువు, మేడ్చల్ జిల్లా దుండిగల్ మల్లం పేట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.

ఈ సందర్భంగా అమీన్‌పూర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దుండిగల్ మల్లంపేట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసుల నమోదుకు హైడ్రా అధికారులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇటీవల మాదాపూర్‌లో సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌న కూల్చివేసిన తర్వాత వరుసగా వర్షాలు రావడంతో హైడ్రా కూల్చివేతలకు కొంత విరామం ఇచ్చారు. ప్రజలంతా వినాయక చవితి పండుగ వాతావరణంలో ఉండగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం కూల్చివేతలు చేపట్టి హైడ్రాను మరోసారి ప్రధాన వార్తల్లో నిలిపారు. 

ఉదయమే రంగంలోకి హైడ్రా..

అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు, కొత్త చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నెల రోజుల్లో రెండుసార్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. పూర్తిస్థాయి నివేదికతో చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం ఉదయం కొత్త చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌తోపాటు పద్మావతినగర్ వెంచర్‌ని కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ, నిర్మాణాలను హైడ్రా అధికారులు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి తొలగించారు.

ప్రధానంగా స్వర్ణపురి కాలనీ, హెచ్‌ఎంటి స్వర్ణపురి కాలనీలోని 323, 324, 329 సర్వే నంబర్లలో అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేశారు. 19 82లో సర్వే నంబర్లు 193, 194, 323లో శ్రీ పద్మావతినగర్ పేరుతో 24 ఎకరాల్లో లేఅవుట్ వేయగా, సుమారు 293 మంది పాట్లను కొనుగోలు చేశారు. 2015 నుంచి ఏపీలోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు తమ ప్లాట్లను కబ్జా చేసి, తమను బెదిరిస్తున్నారని ఇటీవల ప్లాట్ల యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతోపాటు పెద్ద చెరువుకు అనుసంధానంగా ఉన్న కొత్త చెరువు కబ్జా చేసి సుమారు 6 ఎకరాలకు పైగా చెరువును పెద్దపెద్ద బండ రాళ్లు, మట్టితో సదరు వ్యక్తులు పూడ్చి వేశారు. పెద్ద చెరువు పరిశీలనకు వచ్చిన కమిషనర్ రంగనాథ్ కొత్త చెరువు కబ్జాను స్వయంగా పరిశీలించారు. కొత్త చెరువుతోపాటు పద్మావతి లేఅవుట్ భూముల కబ్జా నిజమేనని అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఎమ్మార్వో రాధ, నీటిపారుదల శాఖ డీఈ రామస్వామి ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు ఆదివారం ఆక్రమణలు తొలగించారు. 

కబ్జాదారుల కబంధ హస్తాల్లో పద్మావతి లేఅవుట్

పెద్ద చెరువు, కొత్త చెరువు శిఖంలో సుమారు 20 ఎకరాల పట్టా కలిగిన రాం భూపాల్‌రెడ్డి.. ఇందులో అత్యధిక శాతం పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉండ టం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భా వం తర్వాత పెద్దచెరువు బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టడంతోపాటు సమీప లేఅవుట్లను సైతం కబ్జా చేసి, ప్రహరీలు నిర్మిం చినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అప్పటి ప్రభుత్వం ముందడుగేయలేదు. లక్షలు ఖ ర్చు చేసి ప్లాట్లను కొనుగోలు చేసిన పద్మావతి లేఅవుట్ ప్లాట్ల ఓనర్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా తయారైన పరిస్థితుల్లో హైడ్రా.. వారి జీవితాల్లో కొత్త ఆశలను రేపింది.

నెల రోజులుగా ప్రత్యేక కమిటి ఏర్పాటుచేసుకుని లేఅవుట్ పరిరక్షణకు నడుంకట్టారు. స్థానిక నీటిపారుదల, రెవెన్యూ అధికారులతోపాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సానుకూలంగా స్పందించిన రంగనాథ్.. పెద్ద చెరువు, కొత్త చెరువు పూర్తి వివరాలతోపాటు ఆక్రమణలపై ప్రత్యేక నివేదిక తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణల తొలగింపు ప్రక్రి య ప్రారంభమైంది.

త్వరలోనే తమ ప్లాట్ల ను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు విజయారెడ్డి కోరారు. త్వరలోనే వాణినగర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలపై హైడ్రా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా అమీన్‌పూర్ ము న్సిపల్‌తోపాటు మండల పరిధిలోని ప్రతి చెరువు సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు ఎమ్మార్వో రాధ తెలిపారు. ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, చెరువుల సమీపం లో కొనుగోలు చేయవద్దని కోరారు.

సున్నం చెరువు కబ్జా.. నీటి దోపిడీ 

శేరిలింగంపల్లి, కూకట్ పల్లి మండలాల పరిధిలో విస్తరించి ఉన్న సున్నం చెరువు విస్తీర్ణం 26.23 ఎకరాలు. ఇప్పటికే ఈ చెరువులో 15 ఎకరాలు ఆక్రమణలకు గురవ్వగా మిగతా చెరువులోనూ ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అటు నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్లర్లు ఈ చెరవులో నుంచి హాస్టళ్లకు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఇక్కడ వాటర్ మాఫియా నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నా యి. మోటర్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. చెరువు చుట్టూ కొంత కాలంగా కబ్జాలు ఎక్కువయ్యాయి. హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. దీంతో ఆదివారం సున్నం చెరువులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 

మల్లంపేట కత్వ చెరువులో 11 విల్లాలు కూల్చివేత 

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ౨౮ విల్లాల్లో ౧౧ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. స్థానిక కత్వ చెరువులో ఎన్నారై విజయలక్ష్మీ శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్ పేరిట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని నిర్దారణ చేసుకున్న అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వీటికి సంబంధించి బిల్డర్ విజయలక్ష్మీపై గ తంలో అనేక క్రిమినల్ కేసులు నమోదు అయినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాలపై గతంలోనే నోటీసులు జారీచేసిన అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారు. ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసు బ లగాలు కూల్చివేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.  

శేరిలింగంపల్లిలో కిరోసిన్ పోసుకుని..  

శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ సమీపంలోని సున్నం చెరువు ఎఫ్టీఎల్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువు చుట్టూ ఉన్న పలు బిల్డింగులు, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇచ్చిన నోటీసులపై తాము కోర్టుకు వెళ్లామని, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలో  కూల్చివేతలు ఎలా చేపడ తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొం దరు బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కిరోసిన్ పోసుకున్న వారి ఒంటిపై నీళ్లు చల్లారు.

ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వం, హైడ్రా అధికారుల తీరుపట్ల తీవ్ర అగ్రహం వ్యక్తంచేశారు. పేదలపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్దలపై, ఆక్రమణ దారు లపై చూపాలని మండిపడ్డారు. సున్నం చెరువు ప్రాంతంలో దుకాణాలు, గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో గోపాల్ అనే వ్యక్తిపై హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోపాల్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.