calender_icon.png 8 September, 2024 | 8:45 AM

ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి సుందర్ పిచాయ్‌కి గౌరవ డాక్టరేట్

27-07-2024 12:51:27 AM

శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. భారత్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ వీకే తివారీ, విద్యాసంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు ఆయనకు ’ఆనరరీ డాక్టర్ ఆఫ్ సైన్స్’ను అందించారు. ఈ విషయాన్ని స్వయంగా సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ”నా పూర్వ విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గతవారం గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను డాక్టరేట్ పొందాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆశ పడేవారు.

ఐఐటీలో నేను నేర్చుకున్న విద్య, సాంకేతికతే ఈ రోజు నన్ను గూగుల్ వరకు తీసుకొచ్చింది. టెక్నాలజీని మరింత ఎక్కువమందికి అందించే స్థాయికి చేర్చింది. ఆ విద్యాసంస్థలో నాకు సమయం గడిపే అవకాశం వచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటా’అని  రాసుకొచ్చారు. సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. ఇక, పిచాయ్‌తోపాటు ఆయన సతీమణి అంజలి కూడా ఐఐటీ ఖరగ్పూర్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్‌లో ఆమె సాధించిన విజయాలకు గానూ ’విశిష్ఠ పూర్వ విద్యార్థి అవార్డు’ను విద్యా సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ కార్యక్రమంలో పిచాయ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.