బ్రిటన్‌లో మరో వారం రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు మిగతా ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఆసక్తి రేపుతున్నాయి.ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారతీయ మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుం దన్న అంచనాలతో పద్నాలుగేళ్లుగా సాగిన కన్సర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడనుందని తాజా ఒపీనియన్ పోల్స్ అంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరి వరకు ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో ్లపెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో సునాక్ అనూహ్యం గా పార్లమెంటును రద్దు చేసి జులై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అయినా ప్రయోజనం ఉండకపోవచ్చని సర్వేలు అంటున్నాయి.
లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొం టున్నాయి. స్వయనా రిషి సైతం ఎదురీదుతున్నారని, తన పార్లమెంటు స్థానాన్ని కోల్పోవచ్చని ‘సావంత పోల్’ పేర్కొంది. అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి ప్రధానిగా బ్రిటీష్ చరిత్రలో నిలిచిపోతారు. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కన్సర్వేటివ్ పార్టీ 108 స్థానాలకే పరిమితమవుతుందని ‘యూ గవ్’, 58 స్థానాలే వస్తాయని సావంత అంచనా వేశాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్సర్వేటివ్ పార్టీ ఓటమి దాదాపు సగం ఖాయమైందని విశ్లేషకుల అభిప్రాయం. బ్రిటన్‌లో టోరీలుగా పిలిచే కన్సర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర.
ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో ఆ పార్టీకి వచ్చిన 131 సీట్లే అత్యల్పం. ఈ సారి ఆ రికార్డు బద్దలవుతుందంటున్నారు. సాధారణంగా కన్సర్వేటివ్ పార్టీకి ఓటేసే భారతీయ సంతతి వారు ఈ సారి ఆ పార్టీకి ఓటేయకపోవచ్చని పోల్‌స్టర్ల అంచనా.‘లెఫ్టీ లండన్ లాయర్’ గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీ ప్రధానిగా పగ్గాలు చేపట్టవచ్చంటున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పార్టీలో జోష్ నింపిన ఆయన ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తానని, పన్నుల పెంపుదల లేకుండా మెరుగైన ప్రజాసేవలను అందిస్తామనే హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కన్సర్వేటివ్ పార్టీకి ప్రధాన డోనర్ అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా తన ఓటు లేబర్ పార్టీకేనని బాహాటంగా చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికి మాటికి ప్రధానులు మారడం కన్సర్వేటివ్ పార్టీకి చేటు తెచ్చిం ది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులు కొనసాగిన ట్రస్ పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చారని, సునాక్ దాన్ని పూడ్చలేకపోయారనిఅంటున్నారు. 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని, రుణ భారాన్ని తగ్గిస్తానని, అక్రమ వలసలను అరికడతానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారన్న విమర్శ ఉంది. ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి.
పన్నుల భారం గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలూ పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతలనుంచే విమర్శలు వచ్చాయి. వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. మరోవైపు ‘రిఫార్మ్ యూకే’ పార్టీ పుంజు కోవడం కన్సర్వేటివ్‌లను బాగా దెబ్బతీయనుంది. 15 శాతం ఓట్ల వాటా ఉన్న ఈ పార్టీ చాలా చోట్ల కన్సర్వేటివ్ ఓటు బ్యాంక్‌కు భారీగా గండికొడుతుందని అంచనా. ఇవన్నీ కలిపి సునాక్‌ను పార్టీకి ఘోరపరాజయాన్ని తీసుకువచ్చిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయేలా చేయనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దేశం భవిష్యత్తు మరో వారం రోజుల్లో తేలనుంది.