calender_icon.png 25 September, 2024 | 2:00 PM

ఉదయం ఎండ.. సాయంత్రం వాన

25-09-2024 02:46:51 AM

  1. గ్రేటర్ పరిధిలో దంచికొట్టిన వర్షం
  2. బలమైన గాలులకు పలుచోట్ల కూలిన చెట్లు
  3. ప్రధాన మార్గాల్లో నిలిచిన వరద
  4. భారీగా ట్రాఫిక్ జాం.. వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్ సిటీబ్యూరో/యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): హైదరా బాద్ నగర పరిధిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, అమీర్‌పేట, ఉప్పల్, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, తార్నాక, అంబర్‌పేట, విద్యానగర్, ముషీ రాబాద్‌లో బలమైన గాలులు వీచడంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో వర్షపు తీవ్రత ఎక్కువగా ఉంది. జాతీయ రహదారిపై వరద నిలవడంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు.

సాయంత్రం విద్యాసంస్థల నుంచి వచ్చే విద్యార్థులతో పాటు ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవస్థలు పడ్డారు. శంషాబాద్ మండలంలో సుమారు 20 నిమిషాలపాటు భారీ వర్షం కురిసింది.  నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని పలు రహదారులపై వరద చేరింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, గుండాల, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, ఆత్మకూర్, ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో  మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా చౌటుప్పల్‌లో 60 మి.మీ, గుండాలలో 59 మి.మీ, రాజాపేటలో 58 మి.మీ, మోత్కూరులో 55 మి.మీ వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నదికి వరద తాకిడి పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతంలోని బీబీనగర్, పోచంపల్లి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వరద తాకిడికి జిల్లాలో అతిపెద్ద చెరువు అయిన తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు జలకళ సంతరించుకుంది.

వరద పొంగి చెరువు అలుగు పారింది. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి అధికారులు ఇప్పటికే జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాల్లో చెరువులు, కుంటలను నింపారు. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాల కారణంగా ఆయా చెరువులు నిండి అలుగు పారి, దిగువన ఉన్న గంధమల్ల చెరువుకు వరద చేరింది. దీంతో ఆ చెరువు కూడా అలుగు పారింది.