22-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): వేసవి సెలవుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇటీవల వెలువడిన కొన్ని సర్వేల్లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పడిపోయాయన్న విషయం స్పష్టమైంది. ఉన్నత తరగతులు చదివే చాలా మంది విద్యార్థులకు కింది స్థాయి తరగతులకు సంబంధించిన అంశాలను చదవడం, రాయడం, లెక్కలు చేయలేకపోతున్నారు.
విద్యార్థులకు వివిధ అంశాల్లో తర్ఫీదు ఇవ్వడంతోపాటు ఉపాధ్యాయులకూ వివిధ సబ్జెక్టులలో బోధనా నైపుణ్యాలు పెంచేందుకు విద్యాశాఖ శిక్షణా తరగతులను చేపట్టనుంది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ మండలం నుంచి ప్రతి సబ్జెక్ట్‌లో ఇద్దరు ఎస్జీటీల చొప్పున, జిల్లాల పరిధిలో స్కూల్ అసిస్టెంట్‌లను ఎంపిక చేయనున్నారు. రిసోర్స్ పర్సన్స్ ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెలలో ఆయా జిల్లాల్లో టీచర్లకు వీరు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మేలో శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో టీచర్లందరూ వారివారి హెడ్‌క్వార్టర్లు వదిలి వెళ్లొద్దని ఎంఈవో, హెచ్‌ఎంలకు జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. శిక్షణకు ఉపాధ్యాయులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఒక్క ఉపాధ్యాయుడికి కూడా ఎలాంటి సెలవు మంజూరు చేయొద్దని కొన్ని జిల్లాల్లో అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
24 నుంచి వేసవి సెలవులు..
ఇదిలా ఉంటే ఈనెల 23 పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్ డే కావడంతో 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. పాఠశాల చివరి రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి ప్రొగ్రెస్ రిపోర్టులిచ్చి సెలవులు ప్రకటిస్తారు. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న విషయం తెలిసిందే.