calender_icon.png 30 April, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీలనూ భయపెడుతున్న వేసవి

30-04-2025 01:05:44 AM

  1. జాగ్రత్తలతోనే సమస్యలకు దూరం

ఏఐఎన్యూ వైద్యుడు తైఫ్ బెండెగెరి 

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో మండుతున్న ఎండల తీవ్రతకు మనుషుల సీజన్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే కేసులు రెండున్నర రెట్లు పెరిగాయని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా ఏఐఎన్యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ.. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో రావడంతో వారికి ఏఐఎన్యూల చికిత్సలు చేస్తున్నామన్నారు.

ఈ కాలంలో శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయన్నారు. పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువవుతోందన్నారు.  10 సంవత్సరాల మధ్య పిల్లల్లో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ సమస్య సుమారు 40శాతం తక్కువ అని చెప్పారు.

పాఠశాలకు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఆందోళన కలిగిస్తోందన్నారు. తగినంత నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం మంచిదన్నారు. తగినన్ని నీళ్లు తాగాలని, మూత్రం స్పష్టంగా, లేతరంగులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలని సూచించారు. పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడకం మానేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమన్నారు.