calender_icon.png 17 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుమిత్ రికార్డు స్వర్ణం

03-09-2024 01:35:40 AM

జావెలిన్ త్రోలో పసిడి పతకం

పారిస్: ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం నిలబెట్టుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల ఎఫ్ 64 ఫైనల్లో సుమిత్ బరిసెను రికార్డు స్థాయింలో 70.59 మీటర్లు విసిరి పసిడి పతకం సాధించాడు. శ్రీలంకకు చెందిన కొడిత్తువాక్కు దులన్ (67.03 మీటర్లు) రజతం, ఆస్ట్రేలియాకు చెందిన బరియన్ మైకెల్ (64.89 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో సుమిత్ జావెలిన్‌ను 68.55 మీటర్లు విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టిన సుమిత్ కొత్త చరిత్ర సృష్టించాడు.

తొలి ప్రయత్నంలో 69.11 మీటర్లు విసిరిన సుమిత్.. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్లు విసిరిన సుమిత్ మూడో ప్రయత్నంలో 66.66 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన సుమిత్ ఐదో ప్రయత్నంలో 69.04 మీటర్లు విసిరి మరోసారి మెరిశాడు. ఇక చివరి ప్రయత్నంలో 66.57 మీటర్లు విసిరాడు. ఇక్కడ  విశేషమేమిటంటే గత టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన సుమిత్, మైకెల్, దులన్‌లు ఈసారి కూడా అదే తరహాలో పతకాలు సాధించడం గమనార్హం. ఇదే ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన సందీప్ (62.80 మీ), సాగర్ సంజయ్ (58.03 మీటర్లు) వరుసగా నాలుగు, ఏడో స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు. సుమిత్ పతకంతో భారత్ ఖాతాలో 14 పతకాలు వచ్చి చేరగా.. సుమిత్‌ది మూడో స్వర్ణం.