పెరూగియా (ఇటలీ): భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్.. అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఏటీపీ ర్యాంకింగ్స్‌లో వ్యక్తిగత అత్యుత్తమ స్థానం (77వ ర్యాంక్) పొంది.. తద్వారా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కిచుకున్న నాగల్.. పెరుగియా చాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుమిత్ 6 7 మాక్స్ కస్నికోవాస్కీ (పోలాండ్)పై విజయం సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చిన నాగల్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించాడు.
ఒక ఏస్ కొట్టిన నాగల్.. ఒక డబుల్ ఫాల్ట్ చేసి 3 బ్రేక్ పాయింట్లు కాచుకున్నాడు. 13 గేమ్స్ నెగ్గిన సుమిత్.. 74 పాయింట్లతో సత్తాచాటగా.. 60 పాయింట్లకు పరిమితమైన ప్రత్యర్థి మూల్యం చెల్లించుకున్నాడు. నాగల్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం. గత వారం హైబ్రాన్ చాలెంజ్ గెలిచిన నాగల్.. ఈ టోర్నీలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. శనివారం జరగనున్న సెమీస్‌లో జపాటా (స్పెయిన్)తో నాగల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.