calender_icon.png 28 October, 2024 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సులేమాన్ చెరువు స్వాహా!

28-10-2024 12:20:36 AM

  1. 35.55 ఎకరాల ఎఫ్‌టీఎల్‌లో మిగిలింది 25 ఎకరాలే
  2. చెరువుకు ఆనుకొని వెలిసిన అపార్ట్‌మెంట్లు, షెడ్లు
  3. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

రాజేంద్రనగర్, అక్టోబర్ 2౫: సులేమాన్ చెరువు అక్రమార్కుల చెరలో పడి కబ్జాకు గురువుతోంది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారు లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెతున్నాయి. వివరాలు.. రాజేంద్రనగర్ మండలంలోని ఆరాంఘర్ చౌరస్తా సమీపంలో శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్ వచ్చే మార్గంలో సులేమాన్ చెరువు ఉంది.

దీని మొత్తం విస్తీర్ణం 35.55 ఎకరాలు. అయితే క్రమంగా ఈ చెరువు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. బఫర్ జోన్‌లో నిర్మాణాలు వెలిశాయి. చెరువు పక్కనే కెన్‌వర్త్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతం లో అనేకమంది షెడ్లు వేసి ఆక్రణలకు పాల్పడ్డారు. 

ఆక్రమణల జోలికి వెళ్లని అధికారులు..

ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు ఈ చెరువుకు సంబంధించి హద్దు బంద్‌లు కాపాడేం దుకు బండ్ స్ట్రెంతింగ్ పనులు చేపట్టారు. చెరువు చుట్టూ మట్టివేసి జాలీ కూడా ఏర్పాటు చేశారు. బండ్ స్ట్రెంతింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.74 లక్షలను మంజూ రు చేసింది. ఇదంతా బాగానే ఉన్నా కబ్జాకు గురైన చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధి సంగతి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

35.55 ఎకరాలు ఉన్న చెరువు క్రమంగా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం సుమారు 25 ఎకరాలే మిగిలింది. ఉన్న చెరువు కూడా పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. చాలాకాలంగా అందులో చెత్తాచెదారం వేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం సుమారు రూ.15 కోట్లకు పైగా ఉంటుంది. ఈనేపథ్యంలో వందల కోట్లు విలువ చేసే చెరువు స్థలం కబ్జాకు గురైందని ఆరోపణలు ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవ డంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

సులేమాన్ చెరువు కబ్జా విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే చెరువును సందర్శించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తాం. కబ్జా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవిషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తాం. చెరువుల పరిరక్షణకు సర్కారు కట్టుబడి ఉంది. ప్రజలు కూడా సహకరించాలి. 

 బొమ్మల రాములు, తహసీల్దార్, రాజేంద్రనగర్

‘హైడ్రా’కు నివేదిక పంపించాం

సులేమాన్ చెరువుకు సంబంధించిన ఆక్రమణల విషయమై ఇప్పటికే హైడ్రా అధికారులకు నివేదిక పంపించాం. కొంతకాలంగా చెరువులో చెత్తాచెదారం వేస్తున్నారు. దీంతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో స్ట్రెంత్ బండింగ్ పనులు చేపట్టాం. ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదిస్తాం. చెరువును ఆక్రమణ నుంచి రక్షిస్తాం. 

 జ్యోతిర్మయి, ఇరిగేషన్ ఏఈఈ