స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనయ సుకృతివేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. తబితా సుకుమార్ సమర్పకురాలుగా ఉన్న ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమా విడుదల నేపథ్యంలో డైరెక్టర్ పద్మావతి మల్లాది సోమవారం విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
“చెట్టుకు, మనిషికి లవ్‌స్టోరీ రాస్తే బాగుం టుందన్న నా స్నేహితుడి ఐడియా బాగా నచ్చింది. నాక్కూడా స్వతహాగా పచ్చదనం, చెట్లు అంటే ఇష్టం. మొక్కల గురించి తర్వాతి తరం వాళ్లకు చెప్పాలని ఈ కథ రాసుకున్నా. అహింసా వాదంతో ఒక అమ్మాయి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే ఈ కథ. సందేశంతోపాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా ఇది.
1947లో గాంధీ చనిపోయినప్పుడు తాత నాటిన చెట్టుతో ప్రారంభమవుతుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఫ్రెండ్ ఫామ్‌లో నా కథకు కావాల్సిన చెట్టు దొరికింది. చెరుకు తోటలున్న రంగంపేటలో చిత్రీకరణ చేశాం. ఆ ఊరివాళ్లతో యాక్ట్ చేయిం చాం. వాళ్ల నటనతో సినిమాకు సహజత్వం వచ్చింది.
‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రివ్యూ అప్పుడు థియేటర్‌లో చూసినప్పుడే నా కథలోని అమ్మాయి నాకు సుకృతిలో కనిపించిది. రెండు నెలలు వర్క్‌షాప్ చేశాం. సుకృతి అన్నీ ముందే రిహార్సల్ చేసేది. బాగా లీనమై నటించేది. పొస్తటిక్ మేకప్ అంత ఈజీకాదు.. తగిన బడ్జెట్టూ లేదు. అమ్మాయిలకు జుట్టు చాలా ముఖ్యం.
అయినా సుకృతి కథకు తగ్గట్టుగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని గుండు చేయించుకుంది. సినిమాలో పాటలు, రీ రికార్డింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. గాంధీ అనే అమ్మాయి గురించే కథ. గాంధీ సిద్ధాంతాలు ఆ పాత్రలో ఉంటాయి. పూర్తిగా గాంధీ బయోపిక్ కాదు. గాంధీ, తాత, చెట్టు.. ఈ మూడింటి కథ ఈ సినిమా. మనుషులు, ప్రకృతి మధ్య అహింస అవసరమని ఇందులో చెప్తున్నాం. ప్రతి ఫెస్టివల్‌లో అవార్డ్ రావటంతో రెస్పెక్ట్ పెరిగింది. థియేటర్ రిలీజ్ ఐడియా సుకుమార్‌దే” అని తెలిపారు.