హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్టల్స్‌లో ఇటీవల పెరుగుతున్న ఆత్మహత్యలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచాలని, ప్రైవేట్ హాస్టల్స్‌ను వెంటనే మూసేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై గురువారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మీ, డీవైఎఎఫ్‌ఐ నగర కార్యదర్శి జావీద్, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇరుకైన గదుల్లో నడుపుతున్న ప్రైవేట్ హాస్టల్స్‌ను మూసేయాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. మహాలక్ష్మీహాస్టల్‌లో శ్యామ్‌బాబు అనే వార్డెన్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తూ ఫీజుల పేరుతో వేధింపులకు పాల్పడినట్టు తెలిపారు. విద్యార్థినుల తరఫున అడగడం కోసం వెళ్లిన వారిపై కర్రలతో దాడులు చేస్తూ రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.