29-04-2025 12:20:21 AM
టేకులపల్లి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటుచేసు కున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని రేగులతండాకు చెందిన ఇస్లావత్ దీపిక (19), వెంకట్యా తండాకు బోడ శ్రీను (23) ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కుటుంబాన్ని ఎదిరించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.
కొన్ని రోజులపాటు కుటుంబానికి దూరంగా ఉన్న యువజంట, ఆ తర్వాత వెంకట్యా తండాలోని శ్రీను నివాసానికి వచ్చారు. గత రెండు నెలలుగా కుటుంబ సభ్యులు వరకట్నం కోసం ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీపిక ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. అయితే కుటుంబ కలహాలతో విసిగిపోయిన శ్రీను, ఈ నెల 24న కూల్డ్రింక్లో గడ్డి మందు, ఎలకల మందు కలుపుకొని తాగాడు. తర్వాత ఈ విషయం భార్యకు తెలిపాడు. దీంతో ఆమె కూడా ఆ కూల్డ్రింక్ తాగింది.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భార్యాభర్తలను తొలత కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం జిల్లా హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దీపిక ఈనెల 25న మృతి చెందింది. తాజాగా శ్రీను కూడా ఆదివారం రాత్రి ఒంటి గంటకు చనిపోయాడు. ఎంతో ఆశతో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆరు నెలలు కూడా గడవక ముందే కుటుంబ కలహాల కారణంగా తనువులు చాలించడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.