calender_icon.png 7 January, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత కార్మికుడి ఆత్మహత్య

04-07-2024 01:03:36 AM

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): సిరిసిల్లలో చేనేత పరిశ్రమ సంక్షోభంతో కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. బీవై నగర్‌కు చెందిన పల్లి యాదగిరిగౌడ్(48) గత 30 సంవత్సరాలుగా పరిశ్రమలో వార్పింగ్, సైజింగ్ కార్మి కుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఐదు రోజుల క్రితం పనిచేస్తున్న చోటే రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి అల్లుడు ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటి ముందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు లహరి, నిహారిక ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి వృత్తి పరమైన ఇబ్బందులు ఏమి లేవని, ఇతర కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు ఎం.సాగర్ ప్రకటనలో తెలిపారు. 

సర్కారు వైఫల్యంతోనే: కేటీఆర్

సర్కారు పరిపాలనా వైఫల్యానికి సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుడు ఆత్మ హత్య చేసుకోవడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతోందని ఆరోపించారు. నేతన్న కుటుంబానికి  ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.