- ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో పురుగుల మందు తాగిన రైతు
ఖమ్మం, జూలై 2 (విజయక్రాంతి): తన భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని, ఇప్పటికే భూమిని జేసీబీలు, డోజర్లతో ధ్వంసం చేస్తున్నారని సెల్ఫీ వీడియో చేస్తూ ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోజడ్ల ప్రభాకర్(45)కు ఏడెకరాల ఎకరాలు భూమి ఉంది.
దీనిలో మూడెకరాలకు పైగా భూమిని కొందరు దక్కకుండా చేశారని, తన పొలాన్ని డోజర్లు, జేసీబీలతో పంటను ధ్వంసం చేశారని ప్రభాకర్ బాధపడుతున్నాడు. తన సమస్యపై రెవెన్యూశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళితే, సమయం అయిపోయిందని వెనక్కి పంపించేయడంలో మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం స్వగ్రామానికి వెళ్లే దారిలోని ఖానాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్మానుష ప్రాంతంలో ఆగాడు.
తన మొబైల్‌లో సెల్ఫీ వీడియో చేస్తూ, పురుగు మందు డబ్బాను చూపిస్తూ, తన గోడును మొబైల్‌లో రికార్డు చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని, కనీసం తన కుటుంబానికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వీడియోను గ్రామస్తులకు చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. తర్వాత పురుగు ముంగి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు ప్రభాకర్ విగతజీవిగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
రైతు మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్..
రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మృతుడు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అనుచరులే భూమిని కాజేసేందుకు యత్నిం చారని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.