జడ్చర్లకు చెందిన శృతి అనుమానాస్పద మృతిపై పోలీసుల స్పష్టత
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19: ఈ నెల 16వ తేదీన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధి చిన్న అంజయ్య నగర్‌లోని ఓ హోటల్ రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శృతిది హత్య కాదని, ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిని శృతి ఈ నెల 16న చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, శృతి ఆత్మహత్యకు పాల్పడలేదని, ఆమెను రేప్ చేసి చంపేసి అనంతరం ఉరివేశారు అంటూ కుటుంబ సభ్యు లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శృతి మహబూబ్‌నగర్‌లో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ఓ డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుందని, అదే సమయంలో అక్కడే జీవన్ అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడని తెలి పారు. వారు తరచూ మాట్లాడుకునే వారని, ఈ క్రమంలోనే 16న నగరంలోని రెడ్‌స్టోన్ హోటల్‌లో శృతి, జీవన్, ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్ వేర్వేరుగా గదులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హోటల్ రూమ్‌లో శృతి, జీవన్ ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం పెళ్లి విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకానొక దశలో ఇద్దరు తీవ్రస్థాయిలో గొడవ పడగా, శృతికి గాయాలయ్యాయి. దీంతో జీవన్ ఆమెను గదిలో వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర మనస్థాపం చెందిన శృతి తాను ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. జీవన్‌ను అదే రోజు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.