16-12-2024 09:46:58 PM
యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులు
కుటుంబ సభ్యులకు అప్పగించిన నాగిరెడ్డిపేట పోలీసులు
కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పరిధిలోని పోచారం ప్రాజెక్టులో ఓ యువకుడు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులోని సుచిత్ర ప్రాంతంలో నివాసముండే ఓ యువకుడు కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్య చేసుకోవడానికి సోమవారం పోచారం ప్రాజెక్టు వద్దకు ఆశ సోజు వినయ్ తేజ (28) అనే యువకుడు వచ్చాడు. పోచారం ప్రాజెక్టులో ఆత్మహత్య చేసుకునేందుకు దూకాడు. స్థానికులు నాగిరెడ్డి పేట పోలీసులకు సమాచారం అందించడంతో కానిస్టేబుళ్లు చంద్రయ్య హోంగార్డు కాశయ్యలు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే పోచారం ప్రాజెక్టులో దూకిన వినయ్ తేజను పోలీస్ సిబ్బంది కాపాడారు. ఆత్మహత్యయత్నానికి యత్నించిన యువకున్ని నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆ యువకుల్ని అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందిని ఎస్ఐ అభినందించారు.