calender_icon.png 20 October, 2024 | 3:18 AM

పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం

20-10-2024 12:43:46 AM

  1. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
  2. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
  3. దాడి చేసిన వారిపై కేసు పెట్టినా పట్టించుకోలేదని ఆరోపణ
  4. సీఐ, ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువుల ఆందోళన

జనగామ, అక్టోబర్ 19 (విజయక్రాంతి): భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు చివరికి ఒకరిని బలిగొన్నాయి. సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్యను పోలీసులు పక్కన పెట్టడంతో ఓ యువకుడి నిండు ప్రాణం చితిలో కలిసింది.

పాలకుర్తి మం డలం కొండాపురం గ్రామ పరిధిలోని మేకలతండాకు చెందిన లకావత్ శ్రీను(23)కు అదే మండలంలోని నర్సింగాపురం తండా కు చెందిన రాధికతో 8 నెలల క్రితం వివాహమైంది. వీరి మధ్య కొన్ని రోజులుగా గొ డవలు జరుగుతుండగా మూడు నెలల క్రి తం రాధిక పుట్టింటికి వెళ్లిపోయింది.

పలుమార్లు శ్రీను వారి ఇంటికి వెళ్లి కాపురానికి రావాలని కోరినప్పటికీ భార్య వినలేదు. ఆమె గర్భం దాల్చడంతో పరీక్షలు చేయించుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి ఇటీవల జనగామ ఎంసీహెచ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీను అక్కడికి వెళ్లి భార్య, అత్తామామలతో గొడవ పెట్టుకున్నా డు.

దీంతో రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది. పోలీసులు ఈ నెల 17న శ్రీనును పిలిపించగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే భార్య బంధువులు శ్రీనుపై దాడి చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ శ్రీను అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు.

దీంతో మరుసటి రోజు శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీను పోలీసులను నిలదీశాడు. పోలీసులు పట్టించుకోకపోగా.. భార్య రాధికకే మ ద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పం టించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న అతడ్ని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయిప్రసన్నకుమార్, హెడ్ కానిస్టేబుల్ రవీం దర్‌కు కూడా గాయాలయ్యాయి.

శ్రీనుకు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎంజీఎంకు వెళ్లి, వరంగల్ సీపీ అంబర్ కిశోర్‌ఝాతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

శ్రీను మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న బంధువులు, గిరిజన సంఘాల నాయకులు భారీ సంఖ్యలో ఆగ్రహంతో పాలకుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు ప్రతిఘటించడంతో కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సీఐ, ఎస్సైను సస్పెండ్ చేయాలని, శ్రీనుపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అక్కడికి చేరుకుని శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు.

కాగా.. శ్రీనుపై దాడికి పాల్పడిన తన భార్య బంధువులైన గుగులోతు హుస్సేన్, మాలోత్ వినోద్, గుగులోత్ విజయ, భూక్య మహేశ్, మాలోత్ మంగ్లీపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో రాజకీయ జోక్యం ఉందని, సున్నితమైన కుటుంబ సమస్యపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే యువకుడి ప్రాణం పోయిందని బీఆర్‌ఎస్ నేత అల్లం ప్రదీప్‌రెడ్డి ఆరోపించారు.