16-03-2025 12:00:00 AM
వృద్ధాప్యంలో అల్జీమర్స్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఏదైనా భాష నేర్చుకోండి అని సలహా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. మాతృభాష కాకుండా మరొక భాషని నేర్చుకోవడం వృద్ధాప్యంతోపాటు వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గిస్తుందని 2007లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా ఆ రెండోభాష ఎన్ని విధాలుగా మెదడుని శక్తిమంతం చేస్తుందని గుర్తించారు కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.
అత్యాధునిక ఎఫ్‌ఎంఆర్‌ఐ (ఫంక్షనల్ మ్యాగ్నటిక్ రిజొనన్స్ ఇమేజింగ్) పరికరాల సాయంతో సాధ్యమని నిరూపించారు. రెండో భాష కారణంగా ఏకాగ్రత, ప్రణాళికా సామర్థ్యం, నిర్ణయాత్మక శక్తికి కారణమైన మెదడులోని ‘కాగ్నిటివ్ రిజర్వ్’ భాగాలు బలోపేతమవుతున్నాయని తేల్చారు. అయితే వయసుతో పనిలేకుండా రెండో భాషని ఎప్పుడు నేర్చుకున్నా ఇదే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.